NTV Telugu Site icon

DC vs SRH: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఫ్రేజర్-మెక్‌గర్క్.. ఏకంగా మూడు రికార్డ్స్!

Jake Fraser Mcgurk Dc

Jake Fraser Mcgurk Dc

Jake Fraser-McGurk becomes 4th Batter to Hit Fastest Fifty in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున అత్యంత వేగవంతంగా హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా మెక్‌గర్క్‌ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మెక్‌గర్క్ ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మెక్‌గర్క్ 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. మొత్తంగా 18 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు.

అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున అత్యంత వేగవంతంగా హాఫ్‌ సెంచరీ చేసిన రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు క్రిస్‌ మోరిస్‌ పేరిట ఉండేది. అతడు 17 బంతుల్లో అర్ధ శతకం బాదాడు. తాజా మ్యాచ్‌తో మోరిస్‌ రికార్డును జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ బ్రేక్‌ చేశాడు. ఐపీఎల్‌ 2024లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా మెక్‌గర్క్‌ మరో రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు అభిషేక్‌ శర్మ, ట్రావిస్ హెడ్‌ పేరిట ఉండేది. ఈ సీజన్‌లో వీరిద్దరూ 16 బంతుల్లో ఫిఫ్టీ చేశారు.

Also Read: Middle East: వెస్ట్ బ్యాంక్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి.. 14 మంది మృతి

ఐపీఎల్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ నిలిచాడు. ఈ జాబితాలో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ అగ్ర స్థానంలో ఉన్నాడు. 2023లో జైశ్వాల్‌ 13 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. కేఎల్ రాహుల్, ప్యాట్ కమిన్స్ 14 బంతుల్లో అర్ధ సెంచరీలు చేశారు. యూసుఫ్ పఠాన్, సునీల్ నరైన్, నికోలస్ పూరన్ 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశారు.