NTV Telugu Site icon

Jasprit Bumrah: బుమ్రాను భయపెట్టిన భారత యువ బ్యాటర్‌.. వీడియో వైరల్!

Jasprit Bumrah Mi Bowling

Jasprit Bumrah Mi Bowling

Jasprit Bumrah appreciating Ashutosh Sharma: ఐపీఎల్‌ 2024లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడినా.. ఇద్దరు బ్యాటర్లు మాత్రం ముంబైకి సుస్సు పోయించారు. వారే అశుతోష్‌ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), శశాంక్‌ సింగ్‌ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు). ఏ మాత్రం ఆశలు లేని మ్యాచ్‌లో ఈ ఇద్దరు మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడి.. ముంబైకి ముచ్చెమటలు పట్టించారు. ఓ దశలో ఆశుతోష్‌ అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను భయపెట్టాడు.

ఈ మ్యాచ్‌లో అశుతోష్‌ శర్మ కొన్ని అద్భుత, నమ్మశక్యం కాని క్రికెట్‌ షాట్స్ ఆడాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఆడిన ఓ షాట్‌ అయితే హైలైట్‌గా నిలిచింది. ప్రపంచ మేటి బ్యాటర్లను గడగడలాడించే బుమ్రా బౌలింగ్‌లో అశుతోష్‌ ఎవరూ ఊహించని స్వీప్‌ షాట్‌ ఆడాడు. అంతేకాది అది సిక్సర్‌గా వెళ్లడం విశేషం. బుమ్రా బౌలింగ్‌లో ఇలాంటి షాట్‌ ఆడటం దాదాపుగా అసాధ్యం. కానీ అశుతోష్‌ మాత్రం ఏ తడబాటు లేకుండా అద్భుతంగా ఆడాడు. ఈ షాట్ చూసిన అందరూ నోరెళ్లబెట్టారు. పంజాబ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. అశుతోష్‌ సిక్సర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ షాట్‌ చూసిన క్రికెట్‌ ఫాన్స్ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బుమ్రాను భయపెట్టిన యువ బ్యాటర్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Jasprit Bumrah: ఆ రెండు బ్యాటర్లకు వరంలా మారాయి.. బౌలర్లను ఆటాడుకుంటున్నారు: బుమ్రా

అశుతోష్‌ శర్మ ఆడిన ఆ ఒక్క బంతి మినహా పంజాబ్‌ కింగ్స్‌పై జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు కీలక వికెట్లను పడగొట్టాడు. బుమ్రా తాను వేసిన తొలి ఓవర్‌లోనే (ఇన్నింగ్స్ రెండో ఓవర్) సామ్‌ కరన్, రిలీ రొసోవ్‌ను ఔట్ చేశాడు. 13వ ఓవర్లో డేంజరస్ శశాంక్‌ సింగ్‌ను పెవిలియన్ చేర్చాడు. ఐపీఎల్ 2024లో బుమ్రా ఇప్పటివరకు 13 వికెట్స్ పడగొట్టాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ అతడి వద్దే ఉంది.