Travis Head To Miss IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)కు బిగ్ షాక్. విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ వచ్చే సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా జట్టుకు వరుసగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉండటంతో తన పనిభారాన్ని తగ్గించుకోవాలని హెడ్ భావిస్తున్నట్లు క్రిక్‌ఇన్ఫో తన కథనంలో పేర్కొంది. ఇప్పటికే ఈ విషయాన్ని సన్‌రైజర్స్ యాజమాన్యానికి కూడా తెలియజేసినట్లు సమాచారం. ఇదే జరిగితే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లతో కూడిన ‘ట్రావిసేక్’ ఓపెనింగ్ జోడీ వచ్చే సీజన్‌లో కనిపించదు.
2025 మెగా వేలానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్ హెడ్‌ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2027కు అతడు దూరమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయంపై అధికారిక ప్రక్రియ పూర్తయితే.. ఆ మొత్తం జట్టు వేలం పర్స్‌లో తిరిగి అందుబాటులోకి రానుంది. హెడ్ ఐపీఎల్‌కు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్. రాబోయే నెలల్లో ఆస్ట్రేలియా కీలక టోర్నీలతో బిజీగా ఉండనుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరిగే అవకాశం ఉండటంతో ఆ జట్టు దానిపై దృష్టి పెట్టనుంది. ఆ తర్వాత జూన్ నుంచి ఆగస్టు వరకు ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ జరగనుంది. ఇక 2027 అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచ కప్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల పనిభారాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ గతంలో వ్యాఖ్యానించారు.
ట్రావిస్ హెడ్ గత మూడు సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2024 వేలంలో అతడిని రూ.6.8 కోట్లకు కొనుగోలు చేసిన ఎస్‌ఆర్‌హెచ్.. ఆ తర్వాత జట్టులో కొనసాగించింది. 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ ఫైనల్‌కు చేరడంలో హెడ్ కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో 567 పరుగులు సాధించి తన బ్యాటింగ్ సత్తా చాటాడు. అయితే ఫైనల్లో కోల్‌కతా చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. 2025 సీజన్‌లో 374 పరుగులు చేసిన హెడ్.. 2026లోనూ తన దూకుడును కొనసాగిస్తూ 410 పరుగులు చేశాడు. ఈ రెండు సీజన్లలోనూ 160కు పైగా స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. అభిషేక్ శర్మతో కలిసి అతడు అందించే మెరుపు ఆరంభాలు సన్‌రైజర్స్‌కు బలంగా మారాయి. ఐపీఎల్‌లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీల్లో ‘ట్రావిసేక్’ ఒకటిగా గుర్తింపు పొందింది.
మరోవైపు సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఐపీఎల్ 2027కు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ కారణంగానే కమిన్స్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. కెప్టెన్, బౌలర్‌గా సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కమిన్స్ సారథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ అద్భుత విజయాలు అందుకుంది. ఇప్పుడు ఇద్దరు కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే.. జట్టు కూర్పు, విజయాలపై పెను ప్రభావం పడే అవకాశం ఉంది. కమిన్స్ అందుబాటుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈరోజు సాయంత్రం ఎస్‌ఆర్‌హెచ్ రిటెన్షన్ జాబితా వచ్చాక అసలు విషయం బయటపడనుంది.

