ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం కొనసాగుతోంది. నాలుగు ప్యాకేజీల్లో(ఏ,బీ,సీ,డీ) ప్రసార హక్కుల వేలం జరుగుతోంది. 2023-2027 వరకు ఐపీఎల్ మ్యాచుల శాటిలైట్ (టీవీ) ప్రసారాలు, డిజిటల్ (ఓటీటీ) ప్రసార హక్కుల కోసం వేలం జరుగుతోంది. ఈ వేలంలో ప్రధాన పోటీలో రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ గ్రూప్, జీ నెట్‌వర్క్ ఉన్నాయి. ఇప్పటికే పోటీ నుంచి అమెజాన్ తప్పుకుంది. ఐపీఎల్ ఐదు సీజన్‌లకు సంబంధించి ప్రతి సీజన్‌లో 74 మ్యాచ్‌లకు కలిపి వేలం నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ-వేలం నిర్వహించడం ఇదే మొదటిసారి.
కాగా ప్యాకేజ్-ఏలో ఇండియాలో టెలివిజన్ హక్కులు, ప్యాకేజీ-బిలో ఇండియాలో డిజిటల్ ప్రసార హక్కులు, ప్యాకేజీ-సీలో నాన్ ఎక్స్‌క్లూజివ్ మ్యాచులకు సంబంధించి హక్కులు, ప్యాకేజీ-డీలో ఇండియా కాకుండా ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్, డిజిటల్ హక్కులు లభించనున్నాయి. ప్యాకేజ్ Aలో ఒక మ్యాచ్‌కు రూ.49 కోట్లు, ప్యాకేజ్ Bలో ఒక మ్యాచుకు 33 కోట్లు, ప్యాకేజ్ Cలో ఒక మ్యాచుకు రూ.11 కోట్లు, ప్యాకేజ్ Dలో ఒక మ్యాచుకు రూ.3 కోట్లు ధరను నిర్ణయించారు. ప్రస్తుతం ప్యాకేజ్ A, Bలకు ఆన్‌లైన్‌లోనే వేలం జరుగుతోంది. రిజర్వ్ ధర రూ.32 వేల కోట్లుగా ఉంది.
ప్యాకేజీ A గెలిచిన వారు ప్యాకేజీ Bని కూడా సొంతం చేసుకునే హక్కు ఉంటుంది. కాకపోతే… ప్యాకేజీ B కోసం వచ్చిన బిడ్‌పై 5 శాతం అధిక ధర చెల్లించాలి. ఒకవేళ అంత చెల్లించడం ఇష్టం లేకపోయినా… ప్యాకేజీ B హక్కులపై ఆసక్తి లేకపోయినా.. అప్పుడు ప్యాకేజీ Bని అత్యధిక బిడ్డర్‌కు కేటాయిస్తారు. ప్యాకేజీ B గెలుచుకున్న వారు ప్యాకేజీ Cకి అధిక బిడ్ వేసి సొంతం చేసుకోవచ్చు.
