NTV Telugu Site icon

IPL Media Rights: టీవీ హక్కులు ‘స్టార్‌’కు.. డిజిటల్ హక్కులు ‘రిలయన్స్’కు

Ipl Media Rights

Ipl Media Rights

ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం మంగళవారం ముగిసింది. 2023-2027 సీజన్‌ మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి రూ.48,390.52 కోట్ల భారీ ఆదాయం లభించింది. టీవీ ప్రసార హక్కుల వేలంలో సోనీ నెట్‌వర్క్‌పై స్టార్ నెట్‌వర్క్‌ పైచేయి సాధించింది. దీంతో వచ్చే ఐదేళ్ల పాటు ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్‌వర్క్‌ రూ.23,575 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్‌‌కు చెందిన వయాకామ్‌-18, టైమ్స్‌ ఇంటర్నెట్‌ సంస్థలు సంయుక్తంగా రూ. 23,773 కోట్లకు సొంతం చేసుకున్నాయి. టీవీ హక్కుల కంటే డిజిటల్ హక్కులు ఎక్కువ ధరకు అమ్ముడుకావడం విశేషం.

ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం ముగియడంతో వచ్చే ఏడాది నుంచి హాట్ స్టార్‌లో ఐపీఎల్ ప్రసారం కాదు. డిజిటల్ హక్కులు రిలయన్స్ సంస్థ కొనుగోలు చేయడంతో జియో టీవీ, ఇతర డిజిటల్ మాధ్యమాల్లో మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. గతంలో ఐపీఎల్ మ్యాచ్ విలువ రూ.54.5 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.118 కోట్లకు చేరుకుంది. ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం జరిగిన బిడ్డింగ్‌లో వయాకామ్-18, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, జీ గ్రూప్, అమెజాన్‌, గూగుల్, స్కై స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, సూపర్ స్పోర్ట్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ సంస్థలు పోటీపడగా టీవీ హక్కులను స్టార్ నెట్‌వర్క్‌ భారీ మొత్తం చెల్లించి మీడియా హక్కులను సొంతం చేసుకుంది.

కాగా గతంలో ఐపీఎల్ తొలి పదేళ్ల సీజన్‌ మ్యాచ్‌లకు సంబంధించి మీడియా హక్కులను సోనీ నెట్‌వర్క్ రూ.8,200 కోట్లకు చేజిక్కించుకోగా.. తర్వాతి ఐదేళ్ల సీజన్‌ మీడియా హక్కులను స్టార్ నెట్‌వర్క్ రూ.16,347 కోట్లకు సొంతం చేసుకుంది. తాజా వచ్చే ఐదేళ్ల మీడియా హక్కులను (టీవీ, డిజిటల్) రెండు వేర్వేరు సంస్థలు చేజిక్కించుకోవడం గమనార్హం.