Site icon NTV Telugu

IPL: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇకపై 94!

Ipl 94 Matches

Ipl 94 Matches

క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్‌కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ లీగ్ ప్రారంభం అవుతోందంటే చాలు.. వారం రోజుల ముందు నుంచే పండగలాంటి వాతావరణం నెలకొంటుంది. ఇంత క్రేజ్ ఉండటం వల్లే.. ఈ లీగ్‌ను మరింత పొడిగించాలని నిర్ణయించారు. అవును, ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపాడు. రానున్న సీజన్ల నుంచి ఐపీఎల్‌‌ను రెండున్నర నెలలకు పెంచబోతున్నట్టు ఆయన స్పష్టం చేశాడు. అంటే.. వరుసగా 10 వారాలపాటు ఈ లీగ్ సాగనుందన్నమాట! ఇందుకు ఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని జై షా పేర్కొన్నాడు.

అయితే.. కొత్త ఫ్రాంచైజీలను ఇప్పట్లో తీసుకొచ్చే ఆలోచనేదీ లేదని కుండబద్దలు కొట్టిన జై షా, ఉన్న జట్లతోనే మ్యాచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్టు చెప్పాడు. అంతేకాదు.. ఆటగాళ్ల సంఖ్యను కూడా మరింత పెంచాలనుకుంటున్నట్టు వెల్లడించాడు. 2024-2031 ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌పై చర్చలు జరిపేందుకు వచ్చే వారం ఐసీసీ సమావేశం కానుందని, ఇందులో ఐపీఎల్‌ విండోపై పూర్తి క్లారిటీ వస్తుందని అన్నాడు. కాగా.. ఈ ఏడాది ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల సంఖ్య ఎనిమిది నుంచి పదికి పెరిగిన విషయం తెలిసిందే. దీంతో, మ్యాచ్‌ల సంఖ్య 74 పెరగడంతో ఈ లీగ్ రెండు నెలలపాటు సాగింది. రానున్న సీజన్‌లలో మ్యాచ్‌ల సంఖ్య 94కు పెరిగే అవకాశముంది.

Exit mobile version