Site icon NTV Telugu

Tejasvi Singh-IPL 2026: కేకేఆర్‌కు కొత్త యువ వికెట్‌ కీపర్.. ఎవరీ తేజస్వి సింగ్‌!

Tejasvi Singh Ipl 2026

Tejasvi Singh Ipl 2026

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు మినీ వేలంలో యువ భారత ఆటగాడిని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టులోకి చేర్చుకుంది. అబుదాబిలో జరుగుతున్న వేలంలో ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల వికెట్‌ కీపర్ కమ్ బ్యాటర్ తేజస్వి సింగ్ దహియాను రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. తేజస్వి వేలంలో తన పేరును రూ.30 లక్షల కనీస ధరతో నమోదు చేయగా.. అతడిపై కేకేఆర్ నమ్మకం ఉంచి భారీగా వెచ్చించింది. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీకి వచ్చినా.. కోల్‌కతా వెనక్కి తగ్గకుండా బిడ్ వేసి తేజస్విని సొంతం చేసుకుంది.

తేజస్వి సింగ్ ఇప్పటివరకు 6 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడినా.. తన దూకుడైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. టీ20ల్లో 113 పరుగులు చేసిన తేజస్వి స్ట్రైక్‌రేట్ 168.65గా ఉంది. టీ20ల్లో అతడి సగటు 56.50గా ఉండటం విశేషం. ఇప్పటివరకు 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాదిన ఈ యువ ఆటగాడు గొప్ప ఫినిషర్‌గా మారతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వికెట్ కీపింగ్‌తో పాటు పవర్ హిట్టింగ్ చేయగల ఆటగాడిగా తేజస్వి పేరు తెచ్చుకుంటున్నాడు. యువతకు అవకాశాలు ఇవ్వడంలో మంచి పేరున్న కేకేఆర్.. ఈసారి కూడా తేజస్వి సింగ్ దహియాను కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2026లో తేజస్వి తన ప్రతిభను ఎంతవరకు నిరూపించుకుంటాడో, కేకేఆర్‌కు అతడు ఎంతవరకు ఉపయోగపడతాడో చూడాలి.

ఐపీఎల్ 2026 వేలంలో కేకేఆర్ కొనుగోలు చేసిన నాలుగో ఆటగాడు తేజస్వి సింగ్. అతడికంటే ముందే కేకేఆర్ భారీ సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిపింది. ఆ తర్వాత న్యూజిలాండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ ఫిన్ అలెన్‌ను రూ.2 కోట్లకు, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీశా పతిరనను రూ.18 కోట్లకు దక్కించుకుంది.

Also Read: IPL Auction 2026: ఇది కదా అదృష్టమంటే.. కార్తిక్‌ శర్మకు రూ.14.20 కోట్లు, అకిబ్ దార్‌కు రూ.8.40 కోట్లు!

కేకేఆర్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
కామెరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా) – రూ.25.20 కోట్లు
ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) – రూ.2 కోట్లు
మతీశా పతిరన (శ్రీలంక) – రూ.18 కోట్లు
తేజస్వి సింగ్ దహియా (భారత్) – రూ.3 కోట్లు

 

Exit mobile version