IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!

Hardik Pandya, Arshdeep Singh Trade

Hardik Pandya, Arshdeep Singh Trade

Hardik Pandya, Arshdeep Singh Trade: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు మరో సంచలన ట్రేడ్ జరిగింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్‌ (ఎంఐ) కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ (పీబీకేఎస్)కు ఆడనున్నాడు. బదులుగా పీబీకేఎస్ స్టార్ పేసర్, టీమిండియా మ్యాచ్ విన్నర్‌ అర్ష్‌దీప్ సింగ్ ఎంఐకి మారాడు. ఎంఐ, పీబీకేఎస్ ఫ్రాంచైజీలు ఈ ఇద్దరు ఆటగాళ్ల బదిలీకి అంగీకరించాయి. అయితే ఈ ఒప్పందానికి బీసీసీఐ అధికారిక ఆమోదం లభించాల్సి ఉంది. అధికారిక ప్రకటన ఇంకా చేయనప్పటికీ ఈ ట్రేడ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని ఐపీఎల్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఏదేమైనా పీబీకేఎస్ సహ యజమాని ప్రీతి జింటా మ్యాచ్ విన్నర్‌ను వాడుకోవడంపై ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఆటగాడిగానే హార్దిక్:


ఈ ట్రేడ్‌తో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌తో తన రెండో ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. 2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై జట్టులోకి తిరిగి వచ్చిన హార్దిక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అప్పటివరకు జట్టును నడిపించిన రోహిత్ శర్మ స్థానంలో అతడు సారథిగా వ్యవహరించాడు. అయితే హార్దిక్ నాయకత్వంలో ముంబై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అతడి కెప్టెన్సీలో మూడు సీజన్లలో రెండుసార్లు జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ కొనసాగనున్నాడు. హార్దిక్ పాండ్యా ఆ జట్టులో ఆటగాడిగానే చేరనున్నాడు. శ్రేయస్ నాయకత్వంలో ఆడేందుకు హార్దిక్ కూడా సంతోషంగా ఉన్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.

ఇష్టంగా లేకపోయినా:
అర్ష్‌దీప్‌ను వదులుకోవడానికి పంజాబ్‌ కింగ్ యాజమాన్యం ఇష్టంగా లేకపోయినా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ రికీ పాంటింగ్‌ తీసుకున్న నిర్ణయం మేరకే ఈ ట్రేడ్‌కు అంగీకరించినట్లు తెలుస్తోంది. శ్రేయస్ గత రెండు సీజన్లలో కింగ్స్‌కు నాయకత్వం వహిస్తూ సక్సెస్ అయ్యాడు. అతడి సారథ్యంలో 2025లో పంజాబ్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. 2026 సీజన్ తొలి అర్ధభాగంలోనూ జట్టు మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ.. రెండో భాగంలో వరుసగా ఎదురైన పరాజయాలతో ప్లేఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో హార్దిక్ చేరికతో జట్టు ఆల్‌రౌండర్ విభాగం మరింత బలోపేతం అవుతుందని పంజాబ్ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.

పంజాబ్‌కు కష్టమే:
మరోవైపు అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్‌తో సుదీర్ఘ అనుబంధం కలిగి ఉన్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున అతడు చేసిన ప్రదర్శనలే భారత జట్టులోకి ఎదిగేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ కొనసాగుతున్నాడు. అలాంటి ఆటగాడిని వదులుకోవడం యాజమాన్యానికి సులభమైన నిర్ణయం కాదని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. అయితే కెప్టెన్, కోచ్ అభిప్రాయం మేరకు ఈ ట్రేడ్‌కు ముందుకెళ్లినట్లు పేర్కొన్నాయి. హార్దిక్ పాండ్యాకు ఫిట్‌నెస్ సమస్యలు సవాలుగా మారనున్నాయి. గత ఐపీఎల్ సీజన్ తర్వాత పలు గాయాల కారణంగా అతడు పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. హార్దిక్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కింగ్స్‌కు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఉపయోగపడనున్నాడు.

నవంబర్ 17లోగా అధికారిక ప్రక్రియ పూర్తి?
ఐపీఎల్ ఆటగాళ్ల రిటెన్షన్ గడువును బీసీసీఐ నవంబర్ 17 వరకు పొడిగించినట్లు సమాచారం. దీంతో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్‌కు సంబంధించిన అధికారిక ప్రక్రియలు పూర్తి చేసుకునేందుకు సమయం లభించనుంది. డిసెంబర్ 16న గోవాలో మినీ వేలం నిర్వహించనున్నారు. ఈలోగా బీసీసీఐ ఆమోదం లభిస్తే హార్దిక్, అర్ష్‌దీప్ జట్ల మార్పిడి అధికారికంగా ఖరారు కానుంది. మినీ వేలానికి ముందు మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరాలను పంజాబ్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.