Stephen Fleming Exit form CSK Ahead of IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అభిమానులకు షాక్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్‌కేకు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే అధికారికంగా ప్రకటించింది. దాదాపు 18 ఏళ్ల అనుబంధానికి పరస్పర అంగీకారంతో ముగింపు పలుకుతున్నట్లు సీఎస్‌కే యాజమాన్యం పేర్కొంది. ఇటీవలి మూడు సీజన్లుగా జట్టు వరుసగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడంతో ఫ్లెమింగ్ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరిగాయి. సీఎస్‌కేను ఫ్లెమింగ్ వీడుతున్నాడనే వార్తలు చక్కర్లు కొట్టాయి. చివరికి ఆ ఊహాగానాలే నిజమయ్యాయి.
‘స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో కలిసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన, సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగించాం. ఇప్పుడు ఆ బంధానికి ముగింపు పలికాం. సీఎస్‌కేను ఫ్లెమింగ్ వీడాడు. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పలు సార్లు జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని చెన్నై సూపర్ కింగ్స్ తన ప్రకటనలో పేర్కొంది. ఫ్లెమింగ్ 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో సీఎస్‌కే తరఫున ఆటగాడిగా జట్టులో చేరాడు. అనంతరం 2009లో హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టి జట్టును విజయాల బాట పట్టించాడు. అతడి కోచింగ్‌లో చెన్నై ఐదు ఐపీఎల్ టైటిళ్లతో పాటు రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలను గెలుచుకుంది. అంతేకాదు.. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 12 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరి, 10 ఫైనల్స్ ఆడిన జట్టుగా సీఎస్‌కేను నిలబెట్టడంలో ఫ్లెమింగ్ కీలక పాత్ర పోషించాడు.
సీఎస్‌కే యజమాని రూపా గురునాథ్ ఫ్లెమింగ్ సేవలను కొనియాడారు. ‘సీఎస్‌కే ఫ్రాంచైజీ ప్రయాణంలో దాదాపు రెండు దశాబ్దాల పాటు మా కోచింగ్ విభాగానికి స్టీఫెన్ ఫ్లెమింగ్ పెద్ద దిక్కులా ఉన్నారు. మా జట్టు గుర్తింపు, విజన్, విజయ సంస్కృతిని తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర అమూల్యం. ఆయన అంకితభావం, నాయకత్వం, కృషికి సీఎస్‌కే కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మైదానంలో మా ప్రయాణం ముగిసినా.. సీఎస్‌కే చరిత్రలో ఆయన ఎప్పటికీ అంతర్భాగంగానే ఉంటారు’ అని రూపా గురునాథ్ అన్నారు. ‘జట్టును ఎలా ఆడించాలనే దానికంటే.. సీఎస్‌కే ఎలా ఉండాలనే సంస్కృతిని ఆయన నిర్మించారు. స్థిరత్వం, వినయం, జట్టు ప్రయోజనాలను ముందుంచే విలువలను ఆటగాళ్లలో నాటారు. ప్రతి ఆటగాడి సామర్థ్యాన్ని గుర్తించి ఉత్తమ ప్రదర్శన రాబట్టడం ఆయన గొప్ప ప్రత్యేకత’ అని మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ పేర్కొన్నారు.
తన వీడ్కోలుపై స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. ‘క్రీడల్లో 18 ఏళ్లు అంటే ఒక జీవితకాలం లాంటిది. సీఎస్‌కేతో గడిపిన ఈ ప్రయాణం నా కోచింగ్ కెరీర్‌లో అత్యంత గొప్ప అనుభవం. ఎన్నో చిరస్మరణీయ విజయాలు, కఠిన పరిస్థితులు కలిసి ఎదుర్కొన్నాం. ఈ జ్ఞాపకాలు జీవితాంతం నాతో ఉంటాయి. సీఎస్‌కే ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగానే ఉంటుంది. ఇకపై కూడా సీఎస్‌కే జట్టుకు అభిమానిగా మద్దతు ఇస్తూనే ఉంటాను’ అని భావోద్వేగం చెందాడు.

