IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!

Ipl 2027 Retentions

Ipl 2027 Retentions

Cheteshwar Pujara IPL 2027 Retention Predictions: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఆటగాళ్ల రిటెన్షన్ గడువు సమీపిస్తోంది. నవంబర్ 17లోగా ఫ్రాంచైజీలు తమ జట్లలో కొనసాగించాలనుకునే ఆటగాళ్లు, వదులుకోవాలనుకునే క్రికెటర్ల జాబితాను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పలు ట్రేడ్ వార్తలు, ఆటగాళ్ల విడుదలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు, అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్ నుంచి ముంబైకి మారనున్నారనే ప్రచారం క్రికెట్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా పది ఫ్రాంచైజీల నుంచి ఎవరెవరు విడుదలయ్యే అవకాశం ఉందో తన అంచనాలను వెల్లడించాడు.

‘కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడైన గ్రీన్‌ను వదులుకున్నా.. తిరిగి వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మాట్ హెన్రీ, మాథ్యూ షార్ట్‌లలో ఒకరిని చెన్నై సూపర్ కింగ్స్ విడుదల చేసే ఛాన్సెస్ ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఎవరినీ విడుదల చేయకపోచ్చు. ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండ్యా విడుదల కానున్నాడు. గుజరాత్ టైటాన్స్ రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్‌లలో ఒకరిని వదులుకోవచ్చు. ఈ ఇద్దరూ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయారు’ అని పుజారా వెల్లడించాడు.

‘పంజాబ్ కింగ్స్ నుంచి జేవియర్ బార్ట్‌లెట్, లాకీ ఫెర్గూసన్‌లలో ఒకరు విడుదలయ్యే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి కూడా బౌలర్లలో ఒకరికి ఉద్వాసన పలకవచ్చు. జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్‌లలో ఒకరు రిలీజ్ కానున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పృథ్వీ షా, కరుణ్ నాయర్‌లలో ఒకరు జట్టును వీడవచ్చు. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రూ.21 కోట్లకు కొనుగోలు చేసిన నికోలస్ పూరన్‌ను విడుదల చేసే అవకాశం లేకపోలేదు. అయితే పూరన్‌ను కొనసాగించాలని లక్నో నిర్ణయిస్తే.. ఆయుష్ బదోనీని వదులుకోనుంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి ఎవరు రిలీజ్ అవుతారో చెప్పడం కష్టమే’ అని పుజారా తన అంచనాలు చెప్పాడు. భారీ ధర పలికిన కామెరూన్ గ్రీన్‌, నికోలస్ పూరన్‌లు పక్కకెళ్లి ఆడుకొవడమే మిగిలుంది. ఐపీఎల్ 2026లో పూరన్‌ కాస్త పర్వాలేదనిపించినా.. గ్రీన్‌ మాత్రం తేలిపోయాడు.