IPL 2027 Retention Time and Live Streaming: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. పది ఫ్రాంచైజీలు తమ జట్లలో కొనసాగించే ఆటగాళ్లు, విడుదల చేసే ప్లేయర్ల జాబితాలను నవంబర్ 17లోగా ప్రకటించాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం లోపు ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ లిస్టును సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకుంటుంది?.. ఎవరికి ఉద్వాసన పలుకుతుంది? అనే చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతోంది. రిటెన్షన్ జాబితాల ప్రకటన ఎప్పుడు ఉంటుందని అభిమానులు తెగ వెతుకుతున్నారు.
ఐపీఎల్ 2027 రిటెన్షన్ జాబితాల ప్రకటన కార్యక్రమం సాయంత్రం 5:40 గంటలకు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే జియోహాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనుంది. దీంతో అభిమానులు తమ అభిమాన జట్ల ఆటగాళ్ల జాబితాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఫ్రాంచైజీలు తమ లిస్టును సమర్పించాక.. బ్రాడ్ కాస్టర్ టెలికాస్ట్ చేస్తుంది.
ఈసారి రిటెన్షన్ ప్రకటనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణయాలు ఆసక్తికరంగా మారనున్నాయి. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ వచ్చే ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ కారణంగా వీరిద్దరూ ఐపీఎల్ 2027లో అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో కమిన్స్, హెడ్‌లను సన్‌రైజర్స్ అట్టిపెట్టుకుంటుందా? లేదా వారి అందుబాటుపై ఉన్న అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని వేరే నిర్ణయం తీసుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే జట్టు కూర్పుపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఎస్‌ఆర్‌హెచ్ రిటెన్షన్ జాబితాపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

