IPL 2027-KKR: వాటా విక్రయించనున్న మెహతా గ్రూప్.. కేకేఆర్‌పై ఆసక్తి చూపుతున్న కంపెనీ ఏదంటే!

Kkr Stake Sale, Mehta Group

Kkr Stake Sale, Mehta Group

Ares Management to buy minority stake in KKR: ఐపీఎల్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) యాజమాన్యంలోకి కొత్త పెట్టుబడిదారుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడి సంస్థ ఏరెస్ మేనేజ్‌మెంట్.. కేకేఆర్ ఫ్రాంచైజీలో మైనారిటీ వాటా కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫ్రాంచైజీ యజమానులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఒప్పందంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

వాటా విక్రయించనున్న మెహతా గ్రూప్?:


2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి భారత క్రికెట్ మార్కెట్‌పై ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం కేకేఆర్ యాజమాన్యం నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేతుల్లో ఉంది. ఇందులో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, నటి జూహీ చావ్లా, పారిశ్రామికవేత్త జే మెహతాకు చెందిన మెహతా గ్రూప్ భాగస్వాములుగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మెహతా గ్రూప్ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేకేఆర్‌లో తమకున్న వాటాలో సుమారు 20 శాతం విక్రయించేందుకు మెహతా గ్రూప్ ఆసక్తి చూపింది. ఇందుకోసం ఫ్రాంచైజీ విలువను 1.8 బిలియన్ డాలర్లుగా అంచనా వేసినట్లు సమాచారం. అయితే ఇది ప్రతిపాదిత విలువ మాత్రమేనని, తుది ఒప్పందం కాదని తెలుస్తోంది.

కేకేఆర్‌లో పెట్టుబడులు పెట్టనున్న ఏరెస్ మేనేజ్‌మెంట్?:
అమెరికాకు చెందిన ఏరెస్ మేనేజ్‌మెంట్ కేకేఆర్‌లో వాటా కొనుగోలుపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒప్పందం కుదిరితే మెహతా గ్రూప్‌కు చెందిన వాటాలో కొంత భాగాన్ని మాత్రమే ఈ సంస్థ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంటే షారుఖ్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఇతర భాగస్వాముల వాటాల్లో ఎలాంటి మార్పు ఉండదు.

కేకేఆర్ యాజమాన్యంలో వాటాల లెక్కలివే:
ప్రస్తుతం నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు 55 శాతం వాటా ఉండగా.. మెహతా గ్రూప్‌కు మిగిలిన 45 శాతం వాటా ఉంది. ఇందులో కొంత భాగాన్ని విక్రయిస్తే కేకేఆర్ యాజమాన్య నిర్మాణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఆర్‌సీబీ, ఆర్ఆర్ ఫ్రాంచైజీల వాటాల విక్రయ వ్యవహారాలు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టిని ఐపీఎల్ వైపు మళ్లించాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్‌లోనూ కొత్త పెట్టుబడిదారుడి ప్రవేశంపై ఆసక్తి నెలకొంది. అయితే ఏరెస్ మేనేజ్‌మెంట్‌తో ఒప్పందం కుదురుతుందా?.. మెహతా గ్రూప్ ఎంత వాటాను విక్రయిస్తుంది? అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.