ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. గత వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన యువ ఆటగాళ్లు ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ భవిష్యత్తుపై ఫ్రాంచైజీ పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరినీ సీఎస్కే ఒక్కొక్కరిని రూ.14.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే తొలి సీజన్లోప్రశాంత్, కార్తిక్ తేలిపోవడంతో.. ప్రాంచైజీ ఈ ఇద్దరిలో ఒకరిని విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. యువ ఆటగాళ్లతో జట్టును బలోపేతం చేయాలనే లక్ష్యంతో సీఎస్కే గతేడాది ప్రశాంత్, కార్తిక్‌పై భారీగా పెట్టుబడి పెట్టింది. అయితే కార్తిక్ తన ప్రదర్శనతో ఆకట్టుకోగా.. ప్రశాంత్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో మినీ వేలానికి ముందు ప్రశాంత్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల ఎడమచేతి స్పిన్ ఆల్‌రౌండర్ ప్రశాంత్‌ను ఐపీఎల్ 2026 వేలంలో సీఎస్కే రూ.14.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అతడిపై ఫ్రాంచైజీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే తొలి సీజన్లో ప్రశాంత్ పూర్తిగా నిరాశపరిచాడు. ఆరు మ్యాచ్‌లు ఆడిన ప్రశాంత్.. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 90 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చేసిన 43 పరుగులే అతడి అత్యధిక స్కోరు. ఈ గణాంకాలే అతడిని కొనసాగించాలా? లేదా అని సీఎస్కే యాజమాన్యం ఆలోచిస్తుందట. ప్రశాంత్ ఇంకా యువ ఆటగాడే కావడంతో భవిష్యత్తులో మెరుగుపడే అవకాశాలున్నాయి. అయినప్పటికీ అతడి కోసం ఖర్చు చేయాల్సిన భారీ మొత్తాన్ని జట్టులోని ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని సీఎస్కే భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాజస్థాన్‌కు చెందిన 20 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కార్తిక్ శర్మ తన ప్రదర్శనతో సీఎస్కే యాజమాన్యాన్ని ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2026లో 11 మ్యాచ్‌లు ఆడిన కార్తిక్.. 32.77 సగటుతో 295 పరుగులు చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 71 పరుగుల ఇన్నింగ్స్‌తో మెప్పించాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటర్‌గా అతడి పాత్ర జట్టుకు ఉపయోగపడే అవకాశం ఉండటంతో కార్తిక్‌ను కొనసాగించేందుకు సీఎస్కే మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది. అయితే ప్రశాంత్, కార్తిక్ విషయంలో ఫ్రాంచైజీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ప్రస్తుతం సీఎస్కే పర్స్‌లో రూ.2.4 కోట్లు ఉన్నట్లు సమాచారం. జీతాల పరిమితిలో వార్షికంగా రూ.5 కోట్ల పెంపు తర్వాత ఈ మొత్తం రూ.7.4 కోట్లకు చేరే అవకాశం ఉంటుంది. ప్రశాంత్‌ను విడుదల చేసి. వేలంలో తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేయడం ద్వారా జట్టుకు ఆర్థికంగా ప్రయోజనం కలిగించుకోవాలని సీఎస్కే భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనున్నట్లు సమాచారం. ఆటగాళ్లను కొనసాగించే లేదా విడుదల చేసే తుది జాబితాను నవంబర్ 15లోగా ప్రాంఛైజీలు బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది.

