Site icon NTV Telugu

IPL 2026 Auction: ఫ్రాంచైజీల టాప్ పిక్స్‌ వీరే.. ఈ అన్‌క్యాప్‌డ్ ఇండియన్ ప్లేయర్లపై కాసుల వర్షమే!

Top Uncapped Indian Players Ipl

Top Uncapped Indian Players Ipl

2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 16న జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం అబుదాబిలో జరగనున్న మినీ వేలం కోసం అటు ప్లేయర్స్, ఇటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేలంలో 350 మంది ఆటగాళ్లు పోటీ పడనున్నారు. గరిష్టంగా 77 మంది ఆటగాళ్లను 10 ప్రాంఛైజీలు కొనుగోలు చేయనున్నాయి. ఈ 350 మంది ఆటగాళ్లలో 238 మంది (14 మంది విదేశీ ప్లేయర్స్) ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు కాబట్టి ఈ 238 మంది అన్‌క్యాప్‌డ్ కేటగిరీలోకి వస్తారు. కొంతమంది అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లకు వేలంలో భారీ ధర పలికే అవకాశాలు ఉన్నాయి. ఆ ఐదుగురు ప్లైర్లు ఎవరో ఓసారి చూద్దాం.

ఆకిబ్ నబీ (బేస్ ధర: రూ.30 లక్షలు):
జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ గత కొన్ని సీజన్లలో దేశీయ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. స్వింగ్ బౌలర్ అయిన ఆకిబ్.. ఇటీవల తన బౌలింగ్‌లో బాగా మెరుగయ్యాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అద్భుత గణాంకాలు నమోదు చేస్తున్నాడు. 2025-26 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఏడు మ్యాచ్‌ల్లో 13.26 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. ఆకిబ్ గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లలకు నెట్ బౌలర్‌గా పనిచేశాడు.

అశోక్ శర్మ (బేస్ ధర: రూ.30 లక్షలు):
రాజస్థాన్ ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మ గంటకు 140 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తాడు. లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ అతడి ప్రత్యేకత. గత రెండు సీజన్లలో మంచి బౌలర్‌గా ఎదిగాడు. 2025-26 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు (20 వికెట్లు) పడగొట్టాడు. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లలో భాగంగా ఉన్నాడు. ఈ ఏడాది అశోక్ అరంగేట్రం చేయడం పక్కా అని తెలుస్తోంది.

కార్తీక్ శర్మ (బేస్ ధర: రూ.30 లక్షలు):
19 ఏళ్ల కార్తీక్ శర్మ లోయర్ ఆర్డర్‌లో భారీ హిట్టింగ్ చేస్తాడు. అతడి భారీ హిట్టింగ్ పలు జట్లను ఆకర్షిస్తోంది. వికెట్ కీపర్ అయిన కార్తీక్ గతంలో రాజస్థాన్ రాయల్స్ తరపున 12 మ్యాచ్‌ల్లో 28 సిక్సర్లతో 334 పరుగులు చేశాడు. కెవిన్ పీటర్సన్, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజాలు కూడా అతనిని ప్రశంసించారు. దేశవాళీ క్రికెట్‌లో రాజస్థాన్ జట్టుకు ఫినిషర్‌గా ఉన్నాడు.

ప్రశాంత్ వీర్ (బేస్ ధర: రూ. 30 లక్షలు):
స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్ యూపీ టీ20 లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. 20 ఏళ్ల ప్రశాంత్ 2025-26 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కూడా రాణించాడు. 7 మ్యాచ్‌లలో 112 పరుగులు, 9 వికెట్లు పడగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని ట్రయల్స్‌కు ఆహ్వానించింది. రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

సలీల్ అరోరా (బేస్ ప్రైస్: రూ. 30 లక్షలు):
జార్ఖండ్‌తో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025-26 మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మన్ సలీల్ అరోరా సంచలనం సృష్టించాడు. 45 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, 11 సిక్సర్లతో అజేయంగా 125 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా సలీల్ వేలంలో అధిక ధరను పొందవచ్చు.

Exit mobile version