Site icon NTV Telugu

IPL 2026 Auction: ఐపీఎల్‌ 2026 వేలం నుంచి 1,005 మంది ప్లేయర్స్ ఔట్.. చివరి నిమిషంలో డికాక్‌ పేరు!

350 Players In Ipl Auction 2026

350 Players In Ipl Auction 2026

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంకు రంగం సిద్దమైంది. అబుదాబిలో డిసెంబర్ 16న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో వేలం జరగనుంది. వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది. మినీ వేలంలో పాల్గొనడానికి 1,355 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా.. ఏకంగా 1,005 మంది పేర్లను బీసీసీఐ తొలగించింది. 350 మంది ఆటగాళ్లు మినీ వేలంకు అందుబాటులో ఉన్నారు. ఇందులో 35 మంది కొత్త ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ లిస్టులో చేర్చింది.

ఐపీఎల్ 2026 మినీ వేలంలో 35 మంది కొత్త ప్లేయర్స్ ఉండగా.. ఆ జాబితాలో 23 మంది భారతీయులు, 12 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. విదేశీ జాబితాలో దక్షిణాఫ్రికాకు చెందిన సీనియర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ కూడా ఉన్నాడు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఓ ఫ్రాంఛైజీ క్వింటన్‌ డికాక్‌ పేరును సిఫార్సు చేసిన తర్వాతే తుది జాబితాలోకి వచ్చాడు. ‘ఐపీఎల్ 2026 మినీ వేలంలో 350 మంది ప్లేయర్స్ పాల్గొంటారు. డిసెంబర్ 16 మంగళవారం యూఏఈ సమయం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు) అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో వేలం ప్రారంభమవుతుంది’ అని సోమవారం రాత్రి ఫ్రాంచైజీలకు పంపిన ఇ-మెయిల్‌లో బీసీసీఐ పేర్కొంది.

ఈసారి క్వింటన్ డికాక్ తన బేస్ ధరను సగానికి తగ్గించుకున్నాడు. రూ.1 కోటి కేటగిరీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం కోల్‌కతా నైట్ రైడర్స్ మెగా వేలంలో అతన్ని రూ.2 కోట్ల బేస్ ధరకు కొనుగోలు చేసింది. గత నెలలో కేకేఆర్ విడుదల చేసిన తొమ్మిది మంది ఆటగాళ్లలో డికాక్ కూడా ఉన్నాడు. డికాక్‌ గతంలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి.. మరలా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇటీవల విశాఖ వేదికగా భారత్‌తో జరిగిన మూడో వన్డేలో అతడు సెంచరీ బాదాడు. బీసీసీఐకి సిఫార్సు చేసిన ప్రాంచైజీనే వేలంలో అతడిని కొనుగులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక బిడ్డింగ్ ప్రక్రియ ముందుగా క్యాప్డ్ బ్యాటర్లతో ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆపై ఆల్ రౌండర్లు, వికెట్-కీపర్/బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్ బౌలర్ల వారీగా బిడ్డింగ్ ఉంటుంది. చివరగా అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ కూడా ఇదే పద్దతిలో జరిగే అవకాశముంది.

Exit mobile version