ఈ సీజన్ ఐపీఎల్‌లో కొత్త ఛాంపియన్‌గా గుజరాత్ టైటాన్స్ ఆవిర్భవించింది. లీగ్‌లోకి అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే కప్పు అందుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ విధించిన 131 పరుగుల టార్గెట్‌ను సులభంగా ఛేదించింది. శుభ్‌మన్ గిల్ (45 నాటౌట్), హార్దిక్ పాండ్యా (34), మిల్లర్ (32 నాటౌట్) రాణించడంతో మరో 11 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ గెలుపొందింది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, చాహల్ తలో ఒక వికెట్ తీశారు.
కాగా ఐపీఎల్‌లో ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్, డెక్కన్ ఛార్జర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు మాత్రమే టైటిళ్లను అందుకున్నాయి. ఇప్పుడు ఈ జట్ల సరసన గుజరాత్ టైటాన్స్ కూడా చేరింది. 2008లో ఆడిన తొలి సీజన్‌లోనే రాజస్థాన్ కప్పు అందుకోగా.. ఇప్పుడు ఆడిన తొలి సీజన్‌లో గుజరాత్ జట్టు అదే ఫీట్‌ను సాధించింది.
