Site icon NTV Telugu

IPL 2022: బీసీసీఐకి ఎదురుదెబ్బ.. భారీగా తగ్గిన ఐపీఎల్ వీక్షకుల సంఖ్య

Ipl Ratings

Ipl Ratings

ఐపీఎల్ ప్రసార మ్యాచ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రసార హక్కులను చేజిక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీ పడుతుంటాయి. ఈ మేరకు 2023-2027 నాలుగేళ్ల కాలానికి ప్రసార హక్కుల కోసం బీసీసీఐ త్వరలో టెండర్లను పిలవనుంది. అయితే ఈ టెండర్లు పిలవకముందే బీసీసీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్ వీక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు రిపోర్టులు వచ్చాయి. గత ఏడాదితో పోల్చుకుంటే తొలివారం వీక్షకుల సంఖ్య 33 శాతం పడిపోయింది. బార్క్‌ నివేదిక ప్రకారం గత ఏడాది తొలి 8 మ్యాచ్‌లకు 3.75 టీవీ రేటింగ్‌ లభించగా.. ఈసారి ఆ సంఖ్య 2.52కే పరిమితమైంది. 2020లో తొలి వారం మ్యాచ్‌లకు 3.85 టీవీ రేటింగ్‌ వచ్చింది.

2023 – 2027 ప్రసార హక్కులకు భారీ మొత్తం బిడ్డింగ్‌ వస్తుందని ఆశిస్తున్న బీసీసీఐకి ఈ అంశం పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు డిస్నీ స్టార్‌, టీవీ 18-వయాకామ్‌, అమెజాన్‌, సోనీ సంస్థలు టెండర్‌ పత్రాలను కొనుగోలు చేశాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐకి వ్యూయర్స్‌ సమస్య పట్టుకుంది. అయితే ఈ ఏడాది జట్ల సంఖ్య పెరగడం, ఆటగాళ్లు ఒక టీమ్ నుంచి మరో టీమ్‌కు మారిపోవడం గందరగోళం రేపింది. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాలన్న ఆసక్తి కలగడం లేదని కొందరు క్రికెట్ అభిమానులు వాపోతున్నారు. అందులోనూ తమ అభిమాన ఆటగాళ్లు ధోనీ, కోహ్లీ కెప్టెన్‌గా కూడా లేకపోవడం కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా 33 శాతం వీక్షకుల సంఖ్య తగ్గిపోవడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి.

https://ntvtelugu.com/today-ipl-matches-schedule-in-ipl-2022/

 

Exit mobile version