Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్

Virat Kohliss

Virat Kohliss

Virat Kohli 100 Centuries: క్రికెట్‌ గార్డ్‌ సచిన్ టెండూల్కర్‌ తర్వాత.. అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు కింగ్‌ కోహ్లీ పైనే ఉంది.. అయితే తన కెరీర్‌లో విరాట్‌ కోహ్లీ కూడా 100 సెంచరీలు బాదేస్తాడా? అనే చర్చ మొదలైంది.. ఇప్పటికే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 86 సెంచరీలు సాధించాడు. అయితే తన అంతర్జాతీయ కెరీర్‌ను ఎన్ని సెంచరీలతో ముగిస్తాడనే దానిపై మాజీ భారత క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర అంచనా వేశారు. కోహ్లీ కెరీర్‌లో 100 అంతర్జాతీయ సెంచరీలు పూర్తవుతాయని చాలామంది అభిమానులు ఆశిస్తున్నప్పటికీ.. చోప్రా మాత్రం అతడు 98 సెంచరీల వద్ద తన కెరీర్‌ను ముగిస్తాడని అభిప్రాయపడ్డారు.

కోహ్లీ వచ్చే నెలలో 38 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టనున్నాడు. ఇటీవలే 2027 వన్డే ప్రపంచకప్ తనకు టీమిండియా తరఫున చివరి ప్రధాన టోర్నమెంట్ అవుతుందని కోహ్లీ స్పష్టం చేశాడు. ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ అంతర్జాతీయ సెంచరీల సంఖ్యపై ఆకాశ్ చోప్రా చేసిన అంచనా ఆసక్తికరంగా మారింది. క్రిక్‌ఇన్ఫోతో జరిగిన ఓ కార్యక్రమంలో కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌ను ఎన్ని సెంచరీలతో ముగిస్తాడని అడిగిన ప్రశ్నకు ఆకాశ్ చోప్రా సమాధానమిచ్చారు. కోహ్లీ 98 అంతర్జాతీయ సెంచరీలతో కెరీర్ ముగిస్తాడని ఆయన అంచనా వేశారు. అంటే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 100 అంతర్జాతీయ సెంచరీల ప్రపంచ రికార్డుకు కోహ్లీ రెండు సెంచరీల దూరంలో ఆగిపోతాడని చోప్రా అభిప్రాయం.

ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ తన 55వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. ఇది అతడి కెరీర్‌లో 86వ అంతర్జాతీయ సెంచరీగా నిలిచింది. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో కోహ్లీ తాజా ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. అతడికి 796 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కోహ్లీ కంటే అతని సహచరుడు శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. అదే మ్యాచ్‌లో గిల్ కూడా సెంచరీ సాధించడంతో తన నంబర్ వన్ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. గిల్ ఖాతాలో 816 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.

వెస్టిండీస్‌పై సాధించిన సెంచరీతో కోహ్లీ మరో అరుదైన ఘనతను కూడా అందుకున్నాడు. వన్డే క్రికెట్‌లో 15,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన చరిత్రలో రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అతడి కంటే ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ రికార్డును సాధించాడు. ఇక, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2025 అక్టోబర్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను అధిగమించినప్పటి నుంచి కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. సంగక్కర 50 ఓవర్ల క్రికెట్‌లో 14,243 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 13,704 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆయన 375 వన్డేల్లో ఈ పరుగులు సాధించాడు. శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య 448 మ్యాచ్‌ల్లో 13,430 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ ప్రస్తుతం 86 శతకాలతో కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు కోహ్లీ ఎన్ని సెంచరీలు సాధిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఆకాశ్ చోప్రా అంచనా ప్రకారం.. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ 98 సెంచరీల వద్ద ముగిసే అవకాశం ఉంది.