India A vs Sri Lanka A: వైభవ్ సూర్యవంశీ-శ్రీలంక ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం.. మ్యాచ్ అనంతరం ఉద్రిక్తత..!

Vaibhav Sooryavanshi India

Vaibhav Sooryavanshi India

India A vs Sri Lanka A: దంబుల్లాలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక ‘ఎ’ జట్టు సూపర్ ఓవర్‌లో ఇండియా ‘ఎ’పై విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు సమాన స్కోరు చేయడంతో ఫలితం సూపర్ ఓవర్ ద్వారా తేలింది. అయితే సూపర్ ఓవర్‌లో ఇండియా ‘ఎ’ లక్ష్యాన్ని చేధించలేకపోవడంతో ఓటమి చవిచూసింది. మ్యాచ్ అనంతరం మైదానంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం చర్చనీయాంశమైంది.

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ‘ఎ’ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టుకు సూర్యాంశ్ షెడ్గే 72 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, విప్రజ్ నిగమ్ 51 పరుగులు చేశాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మాత్రం 21 పరుగులకే పరిమితమయ్యాడు. శ్రీలంక ‘ఎ’ బౌలర్లలో విజయకాంత్ వ్యాసకాంత్, మహమ్మద్ షిరాజ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు.

×
×
Ad

266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులే చేసింది. సదీర సమరవిక్రమ 93 పరుగులతో అద్భుతంగా రాణించాడు. అయితే చివరి ఓవర్‌లో అర్షద్ ఖాన్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో శ్రీలంకను గెలుపు దూరంలో నిలిపివేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

దీంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ‘ఎ’ 16 పరుగులు చేసింది. అనంతరం ఇండియా ‘ఎ’ తరఫున సూర్యాంశ్ షెడ్గే, వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌కు వచ్చారు. అయితే శ్రీలంక బౌలర్ కుగదాస్ మతులన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత జట్టు 10 పరుగులకే పరిమితమైంది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఇండియా ‘ఎ’ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఓటమి అనంతరం శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా, వైభవ్ సూర్యవంశీ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు కనిపించాడు. ఈ క్రమంలో ఒక శ్రీలంక ఫీల్డర్‌తో అతడు వాగ్వాదానికి దిగినట్లు మైదానంలో కనిపించింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకముందే సహచర ఆటగాడు సూర్యాంశ్ షెడ్గే జోక్యం చేసుకుని వైభవ్‌ను శాంతింపజేశాడు. అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ, ఈ సిరీస్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అయినప్పటికీ ప్రత్యర్థి జట్లు అతడిపై ప్రత్యేక దృష్టి పెట్టడం, అతడిని కట్టడి చేసేందుకు ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగడం అతడి పెరుగుతున్న ప్రభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. సూపర్ ఓవర్‌లో ఓటమి, అనంతరం మైదానంలో చోటుచేసుకున్న ఉద్రిక్తత ఈ మ్యాచ్‌ను మరింత చర్చనీయాంశంగా మార్చాయి.