Steve Waugh Praises Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సూపర్ స్టార్ వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. 15 ఏళ్ల భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్‌లో అసాధారణ ప్రతిభ ఉందని, అతను తన తరం ఆటగాళ్లలో ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉందని కొనియాడారు. అతడి ప్రస్తుత హైప్‌ను ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పోల్చడం విశేషం. వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన హిట్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసి ఆరెంజ్ క్యాప్ సాధించాడు. అనంతరం భారత జట్టు తరఫున కూడా ఆకట్టుకుని, టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
వైభవ్ ప్రతిభపై స్పందించిన స్టీవ్ వా అతడిని “వన్స్-ఇన్-ఎ-లైఫ్‌టైమ్ ప్లేయర్”గా అభివర్ణించారు. చాలా కొద్దిమంది ఆటగాళ్లు మాత్రమే తాము ఆడే ఆట తీరును మార్చగలరని, వైభవ్ ఇప్పటికే టీ20 క్రికెట్‌పై అలాంటి ప్రభావాన్ని చూపుతున్నాడని అన్నారు. ఇక, యూనివర్సల్ బేబీ బాస్‌ను ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పోల్చుతూ స్టీవ్ వా కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ క్రికెట్‌లో గిల్‌క్రిస్ట్ ఆటను కొంతమేర మార్చాడని, అంతకుముందు డాన్ బ్రాడ్‌మన్ కూడా క్రికెట్‌పై అలాంటి ప్రభావం చూపించారని గుర్తుచేశారు. ఇలాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారని, ఇంత చిన్న వయసులోనే వైభవ్ సాధిస్తున్న విషయాలు అద్భుతమని ప్రశంసించారు.
ఫామ్‌లో హెచ్చుతగ్గులు సహజమే..
అయితే వైభవ్‌కు భవిష్యత్తులో ఫామ్‌లో హెచ్చుతగ్గులు రావడం సహజమేనని స్టీవ్ వా అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఏ ఆటగాడూ ఎప్పుడూ ఒకే స్థాయిలో రాణించలేడని, ప్రతి క్రికెటర్ కెరీర్‌లో ఫామ్ కోల్పోయే దశలు ఉంటాయని చెప్పారు. అలాంటి సమయంలో వైభవ్ చుట్టూ ఉన్న వ్యక్తుల పాత్ర ఎంతో కీలకమని స్టీవ్ వా పేర్కొన్నారు. విజయం సాధిస్తున్నప్పుడు అతిగా ఉత్సాహపడకుండా, విఫలమైనప్పుడు అతిగా నిరాశ చెందకుండా ఉండేలా అతడికి దగ్గరగా ఉన్నవారు మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
సరైన వ్యక్తుల సలహా చాలా ముఖ్యం
వైభవ్‌కు భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో సలహాలు ఇచ్చే వ్యక్తులు ఉంటారని స్టీవ్ వా అన్నారు. అయితే ప్రతి ఒక్కరి సలహాను అనుసరించకుండా, తనకు నిజంగా నమ్మకమైన ఒకరిద్దరిని గుర్తించుకుని వారి మాట వినడం ముఖ్యమని సూచించారు. చిన్న వయసులోనే భారీ విజయాలు, పేరు, అభిమానాన్ని అందుకోవడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని, అందుకే వైభవ్ తన సహజ స్వభావాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలని స్టీవ్ వా సూచించారు.
కాగా, ప్రస్తుతం శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో టీమిండియా బిజీగా ఉన్నప్పటికీ, వైభవ్ సూర్యవంశీ పేరు మాత్రం భారత క్రికెట్‌లో చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. 15 ఏళ్ల వయసులోనే ఇంతటి ప్రశంసలు అందుకుంటున్న వైభవ్ భవిష్యత్తులో ఎలాంటి స్థాయికి చేరుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, భారత దేశవాళీ క్రికెట్ సీజన్‌కు నాంది పలుకుతూ 2026-27 దులీప్ ట్రోఫీ ఆదివారం, ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నుంచి 35 ఏళ్ల అనుభవజ్ఞుడు మహమ్మద్ షమీ వరకు పలువురు ఆటగాళ్లకు తమ సత్తా నిరూపించుకునే కీలక వేదికగా దులీప్ ట్రోఫీ మారనుంది. వైభవ్ సూర్యవంశీ ఈ టోర్నమెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగనున్న వైభవ్.. నార్త్ ఈస్ట్ జోన్‌తో ఆగస్టు 23న ఉదయం 9:30 గంటలకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2లో ఆడనున్నాడు. ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ నాయకత్వం వహిస్తున్నాడు.

