Asia Cup 2022: ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ చేతిలో భంగపడ్డ శ్రీలంక.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి సూపర్-4 బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 180కి పైగా పరుగులు చేసినా శ్రీలంక ఛేదించి 2 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. అటు శ్రీలంకపై పరాజయంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలోనూ బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. ముఖ్యంగా శ్రీలంకతో మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో నో బాల్ వేయడం బంగ్లాదేశ్ కొంప ముంచింది. ఈ విజయంతో శ్రీలంక ఆటగాళ్లు మైదానంలో నాగినీ డ్యాన్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అఫిఫ్ హొసైన్ 39, మెహిదీ హసన్ మిరాజ్ 38, కెప్టెన్ షకీబల్ హసన్ 24, మహ్మదుల్లా 27, మొసాదక్ హొసైన్ 24 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ, చమిక కరుణరత్నె చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసి గెలుపు తీరాలకు చేరింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు డసన్ షనక(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టెయిలెండర్లు సైతం విలువైన పరుగులు చేయడంతో శ్రీలంక గెలుపు దిశగా సాగింది. బౌలర్ ఫెర్నాండో(10 నాటౌట్) విజయం కావాల్సిన పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ఎబడాట్ హోస్సెన్ మూడు వికెట్లు తీయగా.. టస్కిన్ అహ్మద్ రెండు పడగొట్టాడు. ముస్తాఫిర్ రెహ్మాన్, మెహ్‌దీ హసన్ చెరొక వికెట్ పడగొట్టారు.
