Site icon NTV Telugu

Common Wealth Games 2022: క్రికెట్‌లో పతకం ఖాయం చేసుకున్న భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై గ్రాండ్ విక్టరీ

Team India

Team India

Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ మహిళల క్రికెట్ టీ20 లీగ్‌లో భారత్ ఫైనల్ కు చేరింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ 4 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పతకం ఖాయం చేసుకుంది. ఫైనల్లో ఓడిపోయినా భారత్‌కు రజతం వస్తుంది. సెమీఫైనల్లో టాస్ గెలిచిన భారత మహిళలు బ్యాటింగ్ ఎంచుకున్నారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంథాన హాఫ్ సెంచరీతో చెలరేగింది. 32 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి మహిళల టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసింది. ఓవరాల్ టీ20 క్రికెట్‌లో నాకౌట్ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా స్మృతి మంధాన చరిత్రకెక్కింది. జెమియా రోడ్రిగ్స్ 44 పరుగులతో రాణించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు ఉన్నాయి. దీప్తి శ‌ర్మ 22 ప‌రుగులు, హ‌ర్మన్‌ప్రీత్ కౌర్ 20 ప‌రుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో కెంప్ 2 వికెట్లు సాధించగా.. బ్రంట్, సివర్ తలో వికెట్ తీశారు.

Read Also: Common Wealth Games 2022: భారత్ ఖాతాలో చేరిన మరో రెండు పతకాలు

కాగా 165 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బ్యాట‌ర్లలో స్కీవెర్‌ 41 ప‌రుగులు చేయ‌గా… వ్యాట్ 35 పరుగులు, జోన్స్ 31 ప‌రుగులు చేశారు. మిగిలిన బ్యాట‌ర్లు పెద్దగా రాణించ‌లేక‌పోయారు. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా.. పొదుపుగా బౌలింగ్ చేసిన భారత బౌలర్ స్నేహ రానా 10 పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో స్నేహ రానా 2 వికెట్లు సాధించగా.. దీప్తి శర్మ ఒక వికెట్ తీశారు. కాగా రెండో సెమీస్‌లో నెగ్గే జ‌ట్టుతో టీమిండియా మహిళల జట్టు ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌నుంది.

Exit mobile version