India vs Sri Lanka 2nd Test: భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు ఆగస్టు 23వ తేదీ నుంచి అనగా రేపటి నుంచి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC)లో ప్రారంభం కానుంది. గాలేలో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ చూస్తుండగా, మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు.. కొలంబోలో టెస్టు జరిగే ఐదు రోజులూ వేడి, ఉక్కపోతతో పాటు వర్షం, ఉరుములతో కూడిన జల్లులకు అవకాశం ఉందని తాజా వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఆగస్టు 23న వర్షం పడే అవకాశం ఉండగా, ఆగస్టు 24, 25 తేదీల్లో వర్షపు ముప్పు మరింత ఎక్కువగా ఉండొచ్చని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. ఆగస్టు 26, 27 తేదీల్లోనూ అడపాదడపా జల్లులు కొనసాగే అవకాశం ఉంది.
అయితే వర్షం ఉందంటే మ్యాచ్ పూర్తిగా రద్దవుతుందని అర్థం కాదు. తాజా అంచనాల ప్రకారం వర్షం ప్రధానంగా అడపాదడపా జల్లుల రూపంలో ఉండే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ మధ్యలో ఆట నిలిచిపోవడం, ఓవర్లు తగ్గడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. మరో వాతావరణ అంచనా ప్రకారం కొలంబోలో భారీ వర్షం నిరంతరంగా కురిసే అవకాశం తక్కువగా ఉండటంతో పూర్తి మ్యాచ్ వాష్‌అవుట్ అయ్యే ప్రమాదం మాత్రం పరిమితంగానే కనిపిస్తోంది.
గాలే టెస్టులోనూ వర్షం అంతరాయం
తొలి టెస్టులో వర్షం కారణంగా భారత్, శ్రీలంక జట్ల ఆటకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. రెండో రోజు ఆట కూడా దాదాపు నాలుగు గంటల ఆలస్యంతో ప్రారంభమైంది. అయినప్పటికీ భారత జట్టు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని 165 పరుగుల తేడాతో విజయం సాధించింది.. తొలి టెస్టులో దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, అరంగేట్ర ఆటగాడు మానవ్ సుతార్ బంతితో అదరగొట్టాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకే ఆలౌట్ కావడంలో సుతార్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు కొలంబో వాతావరణం కూడా భారత జట్టుకు మరో పరీక్షగా మారనుంది.
భారత్ ముందు సిరీస్ గెలిచే అవకాశం
తొలి టెస్టు గెలవడంతో భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కొలంబో టెస్టులోనూ విజయం సాధిస్తే 2-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసే అవకాశం శుభ్‌మన్ గిల్ సేనకు ఉంటుంది. ఈ మ్యాచ్ భారత్‌కు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసు పరంగానూ కీలకం. వీలైనన్ని టెస్టుల్లో విజయాలు సాధించడం ద్వారా భారత్ తన డబ్ల్యూటీసీ పరిస్థితిని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు శ్రీలంకకు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్‌గా మారింది. తొలి టెస్టులో ఓటమి తర్వాత సిరీస్‌ను సమం చేయాలంటే కొలంబోలో గెలవాల్సిందే. అయితే కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరం కావడం ఆ జట్టుకు మరో సమస్యగా మారింది.

