NTV Telugu Site icon

ఇంగ్లాండ్ కు కలిసి వెళ్తున్న భారత జట్లు…

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత పురుషుల క్రికెట్‌ జట్టు ఇంగ్లాండ్‌ టూర్‌కు వెళ్లనుంది. ఇందుకోసం 24 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ఎంపిక చేసింది. మరోవైపు వచ్చే నెలలో మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత మహిళల క్రికెట్‌ టీమ్‌ కూడా మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనుంది. ప్రతి ఫార్మాట్‌కు 18 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఒక టెస్ట్ మూడు వన్డేలు మూడు టీ20లు ఆడనుంది. దాంతో ఈ ఇంగ్లండ్ పర్యటన కోసం కోహ్లీసేన, మిథాలీ బృందం జూన్‌ 2న ముంబై నుంచి లండన్‌కు వెళ్లనున్నాయి. అయితే ఇలా భారత పురుషులు, మహిళల క్రికెట్‌ జట్లకు చెందిన ఆటగాళ్లు ఒకే చార్టర్డ్‌ విమానంలో కలిసి ప్రయాణించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.