NTV Telugu Site icon

భారత రెజ్లింగ్‌ పై భారీ అంచనాలు…

స్వతంత్ర భారత్‌ కు తొలి ఒలింపిక్ పతకం రెజ్లింగ్‌ లోనే వచ్చింది. వ్యక్తిగత విభాగంలో ఇది తొలిపతకం.అప్పటి నుండే దేశంలో రెజ్లింగ్‌ పై ఆసక్తి పెరిగింది. గత మూడు ఒలింపిక్స్‌ క్రీడల్లో రెజ్లర్లు భారత్‌కు పతకాలు సాధించారు. దాదాపు ఐదున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో సుశీల్‌ కుమార్‌ సాధించిన కాంస్య పతకం భారత రెజ్లింగ్‌ ముఖచిత్రాన్ని మార్చేసింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సుశీల్‌ మళ్లీ తన పట్టు నిలబెట్టుకొని రజతం సంపాదించగా… యోగేశ్వర్‌ దత్‌ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లర్‌ సాక్షి మలిక్‌ కాంస్య పతకాన్ని దక్కించుకొని దేశం గర్వపడేలా చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత మల్ల యోధులపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి భారత్‌ తరఫున ఏడుగురు బరిలో ఉండగా… అందులో కనీసం ముగ్గురు కచ్చితంగా పతకంతో తిరిగి వస్తారని క్రీడాభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

కొన్నేళ్లుగా బరిలోకి దిగిన ప్రతి టోర్నమెంట్‌లో బజ్‌ రంగ్‌ పూనియా పైచేయి సాధిస్తున్నాడు.గత పది టోర్నీల్లో ఆరు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించాడు. బజరంగ్‌కు జపాన్‌, రష్యా, మంగోలియా, హంగేరి రెజ్లర్ల నుంచి గట్టిపోటీ లభించే అవకాశాలున్నాయి.

రెండేళ్ల క్రితం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అందరి అంచనాలను తారుమారు చేశాడు రెజ్లర్‌ రవి దహియా తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రవి, రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచాడు. రష్యా, టర్కీ, జపాన్‌ రెజ్లర్ల నుండి గట్టిపోటీ లభించనుంది.

జూనియర్‌ నుంచి సీనియర్‌ స్థాయి వరకు నిలకడగా రాణిస్తున్న రెజ్లర్‌ దీపక్‌ పూనియా. 22 ఏళ్ల దీపక్‌ 2019 జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి… అదే ఏడాది జరిగిన సీనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గి టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకున్నాడు. పెద్దగా అంచనాలు లేకపోవడం దీపక్‌కు కలిసివచ్చే అంశం.

ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగి మోకాలి గాయంతో క్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌ మధ్యలోనే వైదొలిగింది వినేశ్‌ ఫోగట్‌. ఈసారి మాత్రం పతకంతో తిరిగి రావాలని పట్టుదలతో ఉంది. కౌంటర్‌ ఎటాక్‌ చేసే క్రమంలో ప్రత్యర్థులకు పాయింట్లు సమర్పించుకునే బలహీనత ఉన్న వినేశ్‌ దీనిని అధిగమిస్తే స్వర్ణం సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

వీరితో పాటు రెజ్లర్లు సీమా బిస్లా, అన్షు మలిక్‌, సోనమ్‌ మలిక్‌ లపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.