NTV Telugu Site icon

Womens Asia Cup: రప్ఫాడించిన రోడ్రిగ్స్.. లంకపై భారత్ ఘనవిజయం

India W Vs Sl W

India W Vs Sl W

Indian Women Team Won First Match In Asia Cup Against Sri Lanka: మహిళల ఆసియా కప్-2022 టోర్నీ ఈరోజు నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే! ఈ టోర్నీలో భాగంగా భారత్, శ్రీలంక మధ్య తొలి పోరు జరగ్గా.. భారత్ ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 150 పరుగులు చేయగా.. 109 పరుగులకే శ్రీలంక కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు కుదురుగా రాణించలేకపోయారు. దీంతో మొదటి పోరులో భారత్ అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు భారత జట్టు బరిలోకి దిగింది. ఓపెనర్లు పెద్దగా సత్తా చాటలేకపోయారు. టీమిండియాకు శుభారంభాన్ని అందించలేకపోయారు. షెఫాలి వర్మ (10), స్మృతి మందాన (6) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అయితే.. ఆ తర్వాత వచ్చిన రోడ్రిగ్స్(53 బంతుల్లో 76) , హర్మన్‌ప్రీత్(30 బంతుల్లో 33) బాగా రాణించారు. వెంటనే వికెట్ పడనివ్వకుండా, ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదుతూ వచ్చారు. వీళ్లిద్దరు కలిసి మూడో వికెట్‌కి 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లు అంతగా రాణించలేకపోయారు. దీంతో.. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో రణసింగే మూడు వికెట్లతో సత్తా చాటగా.. కుమారి, చమరి చెరో వికెట్ తీసుకున్నారు.

ఇక 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు మొదట్లో కొన్ని మెరుపులు మెరిపించింది కానీ, ఆ తర్వాత కుదేలైంది. ఓపెనర్ హర్షిత (26) ఐదు ఫోర్లతో రాణించగా.. ఆమెతో పాటు క్రీజులోకి వచ్చిన చమరి (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. ఆ తర్వాత మాల్షా కూడా రనౌట్‌తో పెవిలియన్ చేరింది. హసిని పెరీరా (32 బంతుల్లో 30) జట్టుని ముందుకు నడిపించేందుకు ప్రయత్నించింది కానీ, ఆమెకి ఎవ్వరూ మద్దతు ఇవ్వలేదు. ఇతర బ్యాటర్లు క్రీజులో అడుగుపెట్టినట్టే పెట్టి, వెంటనే వెనుదిరిగారు. రణసింగే (11) మినహాయించి.. మిగతా వాళ్లంతా భారత బౌలర్ల ధాటికి సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. దీంతో.. 109 పరుగులకే లంక జట్టు కుప్పకూలగా, 41 పరుగుల తేడాతో భారత విజయం సాధించింది. భారత బౌలర్లలో హేమలత 3 వికెట్లు తీయగా.. పూజ, దీప్తి చెరో రెండు వికెట్లు, రాధ ఒక వికెట్ తీశారు.