NTV Telugu Site icon

CWG 2022: లాన్‌బౌల్స్‌లో భారత్ చారిత్రాత్మక విజయం.. తొలి బంగారు పతకం కైవసం

India Win Gold In Lawn Bowls

India Win Gold In Lawn Bowls

CWG 2022: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత లాన్ బౌల్స్ మహిళల జట్టు బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ బంగారు పతకంతో భారత్ మొత్తానికి నాలుగో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లెంది. ఐదో రోజు మహిళల లాన్ బౌల్స్ ఫైనల్లో భారత్ 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 92 ఏళ్ల కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత లాన్ బౌల్స్ మహిళల జట్టు పతకం సాధించింది. ఈ క్రీడలో భారత్‌కు ఇది తొలి పతకం. బలమైన దక్షిణాఫ్రికా జట్టును అధిగమించడానికి ఫైనల్‌లో జట్టు గొప్ప ప్రదర్శనను అందించింది.

ఓపెనింగ్‌లోనే భారతీయులు భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. అయితే దక్షిణాఫ్రికా 10-8తో ముందుకు సాగడానికి తీవ్రంగా కృషి చేసింది. ఒక దశలో స్వర్ణం జారిపోతున్నట్లు అనిపించింది. చివరకు భారత జట్టు నెగ్గి చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణులు లవ్లీ చౌబే, పింకీ, నయన్‌మోని సైకియా, రూపా రాణి టిర్కీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతకుముందు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్‌లోకి ప్రవేశించడంతో వీరు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఎందుకంటే ఇప్పటివరకు లాన్ బౌల్‌లో భారతదేశం ఎటువంటి పతకం సాధించలేదు.

Common Wealth Games 2022: లాంగ్ జంప్‌ ఈవెంట్‌లో ఫైనల్‌కు మురళీ శ్రీశంకర్, మహమ్మద్ అనీస్

భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ పోరు హోరాహోరీగా సాగింది. భారత మహిళలు మంచి ఆరంభంతో ఆకట్టుకున్నారు. అయితే, 3 రౌండ్ల తర్వాత స్కోరు 3-3తో సమమైంది. దీని తర్వాత, భారత్ ధీటుగా బదులిచ్చి 7వ రౌండ్ తర్వాత 8-3 ఆధిక్యంలో నిలిచింది. ఈ ఆధిక్యం భారత్‌కు ఎక్కువ కాలం నిలవలేదు. ఈ రౌండ్ తర్వాత, దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని పొందడం ప్రారంభించింది. 12వ రౌండ్ తర్వాత, ఇద్దరి స్కోరు 10-10తో సమానంగా నిలిచింది. అనంతరం పుంజుకున్న భారత మహిళలు 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించి, బంగారు పతకం సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు భారత్‌ మొత్తం 10 పతకాలు సాధించింది. అందులో నాలుగు బంగారు పతకాలు కాగా, 3 రజతం, 3 కాంస్యాలు ఉన్నాయి.