Site icon NTV Telugu

భారత్‌-శ్రీలంక మూడో టీ-20.. సిరీస్‌ ఎవరిది..?

India

India

టీమిండియాతో జరిగిన రెండో టీట్వంటీ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెల్చి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంకజట్టుకు.. బౌలర్లు చక్కని ఆరంభాన్నిచ్చారు. ఆది నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన లంకేయులు.. భారత్‌ను స్వల్పస్కోరుకు కట్టడి చేశారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌… నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కెప్టెన్‌ ధావన్‌ 42 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ధావన్, పడిక్కల్ మినహా ఎవరూ రాణించలేదు. దీంతో భారత్‌ శ్రీలంక ఎదుట స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.

133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మ్యాచ్‌ గెలవడానికి చెమటోడ్చింది. 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన డిసిల్వా మినోద్‌ భానుకతో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది లంక. భారత బౌలర్లలో కుల్దీప్ రెండు వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్, చేతన్ సకారియా, రాహుల్ చహర్‌ ఒక్కో వికెట్ తీశారు. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. నేడు జరగనున్న మూడో వన్డే… సిరీస్ విజయంలో కీలకం కానుంది.

Exit mobile version