Site icon NTV Telugu

లార్డ్స్‌ టెస్టులో చేతులెత్తేసిన భారత్‌

రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో…భారత్‌ బ్యాట్స్‌మెన్లు పోరాడుతున్నారు. నాలుగో రోజు ఆట నిలిచిపోయేసరికి 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను ముందుగానే నిలిపివేశారు. రిషభ్‌ పంత్‌ 14 పరుగులు, ఇషాంత్‌ శర్మ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. చివరి రోజు రిషబ్‌ పంత్‌ ధాటిగా ఆడి పరుగులు సాధిస్తే….భారత్‌ ఓటమి నుంచి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయ్. పంత్‌కు…టెయిలెండర్లు ఎలా సహకారం అందిస్తారన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సిడ్నీ టెస్టులో మాదిరిగా రాణిస్తే…ఈ టెస్టు మ్యాచ్‌ కూడా డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యర్థికి 250 పరుగుల టార్గెట్‌ కూడా విధించకపోతే…మనకు కష్టాలే. ఇంగ్లీష్‌ జట్టుపై వీలైనన్ని ఎక్కువ పరుగులు చేస్తే…భారత్‌ ఓటమి తప్పినట్లే.

అంతకుముందు అజింక్య రహానె చతేశ్వర్‌ పుజారా…నాలుగో వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకొల్పారు. 55 పరుగులకే ముగ్గురు టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమవడంతో రహానె, పుజారా కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ వంద పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు.ఇద్దరు క్రీజులో కుదురుకున్నారని అనుకునే లోపే…పూజారా ఊహించని బంతికి పెవిలియన్‌ చేరాడు. కాసేపటికే అర్ధ శతకంతో కొనసాగుతున్న రహానె కూడా ఔటయ్యాడు. మోయిన్‌ అలీ బౌలింగ్‌లో కీపర్‌ చేతికి చిక్కాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న రవీంద్ర జడేజా నిరాశపరిచాడు. మోయిన్‌ అలీ బౌల్డ్‌ చేయడంతో భారత్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. అలా స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌, ఇషాంత్‌ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 82 ఓవర్ల తర్వాత వెలుతురు లేమి కారణంగా…అంపైర్లు ఆటను నిలిపివేశారు. అంతకుముందు రాహుల్, రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ తక్కువ స్కోరుకు పెవిలియన్‌ చేరారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మార్క్‌వుడ్‌ మూడు, మోయిన్‌ అలీ రెండు వికెట్లు తీశారు.

Exit mobile version