Site icon NTV Telugu

India Vs West Indies: ధావన్ సెంచరీ మిస్.. తొలి వన్డేలో భారీ స్కోరు చేసిన టీమిండియా

Shikar Dhawan

Shikar Dhawan

Team India scored 308 runs against west indies in first odi
పోర్టు ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఓపెనర్లు రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. ధావన్ (97), శుభ్‌మన్ గిల్ (64) హాఫ్ సెంచరీలతో రాణించడంతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ధావన్ మూడు పరుగుల తేడాలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ధావన్-గిల్ తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్ రనౌట్‌గా వెనుతిరిగిన తర్వాత శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. అతడు కూడా 54 పరుగులు చేసి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ధావన్‌తో కలిసి 94 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.

తాజా ఇన్నింగ్స్ ద్వారా శ్రేయస్ అయ్యర్ అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో తన 25వ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ ఈ మైలురాయి చేరుకున్నాడు. తద్వారా 25ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగులు చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో కలిసి ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్ 24ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్నారు. ధావన్, గిల్, అయ్యర్ మినహాయిస్తే.. సూర్యకుమార్ యాదవ్(13), సంజు శాంసన్(12), దీపక్ హుడా(27), అక్షర్ పటేల్ (21) పరుగులు మాత్రమే చేశారు. కాగా వెస్టిండీస్ బౌలర్లలో జోసెఫ్, మోతీ రెండేసి వికెట్లు తీయగా షెపర్డ్, హుస్సేన్ తలో వికెట్ సాధించారు.

Exit mobile version