IND Vs AUS: మొహాలీలో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ రోహిత్ 11 పరుగులకే అవుట్ కాగా విరాట్ కోహ్లీ 2 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడి ఆసీస్ బౌలర్లకు కళ్లెం వేశాడు. అతడు 25 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుటయ్యాడు. సూర్య అవుట్ అయ్యాక కూడా టీమిండియా జోరు తగ్గలేదు.
Read Also:Oscar 2023: `ట్రిపుల్ ఆర్` కాదు `చెల్లో షో`కు ఆస్కార్ ఎంట్రీ!
టీమిండియా 200 పరుగులకు పైగా స్కోరు చేసిందంటే దానికి కారణం ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యానే. అతడు 30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గ్రీన్ వేసిన చివరి ఓవర్‌లో చివరి మూడు బంతులను వరుసగా సిక్సర్లుగా మలచడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అయితే పంత్ స్థానంలో ఈ మ్యాచ్‌లో స్థానం సంపాదించిన దినేష్ కార్తీక్ విఫలమయ్యాడు. అతడు 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆసీస్ బౌలర్లలో ఇల్లీస్ మూడు వికెట్లు సాధించగా జోష్ హేజిల్ వుడ్ రెండు వికెట్లు, గ్రీన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆస్ట్రేలియా 209 పరుగులు చేయాల్సి ఉంది.
