India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!

India Playing Xi Vs Japan T20

India Playing Xi Vs Japan T20

India Playing XI vs Japan T20: ఏషియన్ గేమ్స్ 2026 కోసం భారత క్రికెట్ జట్టు జపాన్ చేరుకుంది. పురుషుల క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానుండగా.. టీమిండియా సెప్టెంబర్ 28న తన మ్యాచ్ ఆడనుంది. అయితే ఏషియన్ గేమ్స్‌కు ముందు జపాన్‌తో భారత్ ఒక ఏకైక టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్, జపాన్ జట్లు తొలిసారి తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌ను సుజుకి కప్ పేరుతో నిర్వహిస్తున్నారు. జపాన్‌లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఏషియన్ గేమ్స్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లకు ఇది సన్నాహక మ్యాచ్‌గా ఉపయోగపడనుంది.

జపాన్‌తో జరిగే ఏకైక టీ20లో భారత్ తుది జట్టు ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. స్టార్ ప్లేయర్స్ జస్ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లకు టీమిండియా మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యువ ఆటగాళ్లకు తమ సత్తా చాటుకునే అవకాశం లభించనుంది. అభిషేక్ స్థానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రానున్నాడు. వైభవ్, సంజు శాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. వన్‌డౌన్‌లో శ్రేయస్ అయ్యర్, నాలుగో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఆ తర్వాత శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, విప్రజ్ నిగమ్‌లకు అవకాశం దక్కవచ్చు. గాయ‌ప‌డిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి స్థానంలో విప్ర‌జ్ జట్టులోకి వచ్చాడు. బౌలింగ్ విభాగంలో అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఫాస్ట్ బౌలర్లుగా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. స్పిన్ బాధ్యతలను రవి బిష్ణోయ్ చేపట్టే అవకాశముంది. జపాన్ పర్యటనలో భారత జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే.

భారత్ ప్లేయింగ్ 11 (అంచనా):
వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, విప్రజ్ నిగమ్, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్.