Site icon NTV Telugu

India vs Western Australia: ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం.. దేశవాళీ జట్టు చేతిలో..

India Vs Western Australia

India Vs Western Australia

India Lost Practice Match Against Wester Australia Team: రీసెంట్‌గా ఆడిన టీ20 సిరీస్‌లలో భారత బౌలింగ్ లైనప్ పేలవంగా ఉన్నప్పటికీ.. బ్యాటింగ్ పటిష్టంగా ఉండటంతో, ఆ సిరీస్‌లను కైవసం చేసుకోగలిగింది. దీంతో.. వరల్డ్‌కప్‌లో కూడా టీమిండియా మంచి ప్రదర్శనతో దూసుకెళ్తుందన్న నమ్మకాలు క్రీడాభిమానుల్లో నెలకొన్నాయి. అయితే.. ఇప్పుడా నమ్మకం సన్నగిల్లేలా కనిపిస్తోంది. అసలు భారత జట్టు వరల్డ్‌కప్‌లో నెట్టుకురాగలదా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇందుకు కారణం.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూడటమే!

టీ20 వరల్డ్‌కప్‌కు సన్నద్ధమయ్యేందుకు భారత జట్టు కాస్త ముందుగానే ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే! అక్కడ టీమిండియాకు, దేశవాళీ క్రికెట్ జట్టు వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించారు. దేశవాళీ జట్టే కదా.. భారత జట్టు చిత్తు చిత్తు చేస్తుందిలే అని భారతీయ అభిమానులు భావించారు. కానీ, అందుకు భిన్నంగా టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. 36 పరుగుల తేడాతో ఆ దేశవాళీ జట్టు చేతిలో ఓటమి పాలైంది. ఒక్క కేఎల్ రాహుల్ మినహాయిస్తే.. మిగతా భారత బ్యాట్స్మన్లందరూ చేతులు ఎత్తేశారు. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోలేక, వెనువెంటనే పెవిలియన్ చేరారు. అందుకే, సాధ్యమైన లక్ష్యాన్ని కూడా చేధించలేక భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

పెర్త్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టీమిండియా టాస్ గెలవగా, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో బ్యాటింగ్‌కి దిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. నిక్ హాబ్సన్ (64), డార్సీ షార్ట్ (52) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం 169 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన టీమిండియా.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ ఒక్కడే 74 పరుగులతో రాణించాడు. మిగతా కీలక ఆటగాళ్లంతా భారీ స్కోర్లు చేయకపోవడంతో.. భారత్ ఓడింది. దీంతో.. భారత జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి.

Exit mobile version