NTV Telugu Site icon

ఇన్నింగ్స్ తేడాతో ఓడిన టీం ఇండియా…

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్ లో టీం ఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. ఆతిథ్య జట్టు అయిన ఇంగ్లాండ్ భారత జట్టు మీద ఇన్నింగ్స్ పై 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే కుప్ప కూలిపోయింది. ఆ తర్వాత తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు 432 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్(121) సెంచరీతో చెలరేగిపోయాడు. దాంతో కోహ్లీ సేన పై 354 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది ఇంగ్లాండ్ జట్టు. ఆ తర్వాత నిన్న రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ ను తర్వగా కోల్పోయిన హిట్ మ్యాన్ రోహిత్ అర్ధశతకం చేసి వెనుదిరిగాడు. అనంతరం పుజారా(91), కోహ్లీ(45) ఇంగ్లిష్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని మరో వికెట్ పడకుండా నిన్న ఆటను ముగించారు.

కానీ నేడు నాలుగు రోజు ఆట ఆరంభమైన తర్వాత పుజారా ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ కు చేరుకోగా కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలింగ్ ధాటికి భారత బ్యాట్స్మెన్స్ అందరూ వరుసగా పెవిలియన్ దారి పట్టడంతో రెండో ఇన్నింగ్స్ లో 278 పరుగులకే జట్టు ఆల్ ఔట్ అయ్యింది. దాంతో ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించి టెస్ట్ సిరీస్ ను 1-1 తో సమానం చేసింది. చూడాలి మరి మిగిలిన రెండు టెస్ట్ లలో ఏం జరుగుతుంది అనేది.