Road Safety World Series: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా లెజెండ్స్ టీమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లకు 217 పరుగులు చేసింది. రిటైర్ అయినా తమలో సత్తా తగ్గలేదని పలువురు ఆటగాళ్లు నిరూపించారు. సచిన్(16), నమన్ ఓజా(21), రైనా(33), యువరాజ్(6) పరుగులు చేయగా.. స్టువర్ట్ బిన్నీ మాత్రం చెలరేగిపోయాడు. 42 బంతుల్లోనే 6 సిక్సులు, 5 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. చివర్లో యూసఫ్ పఠాన్ 15 బంతుల్లో 35 పరుగులు చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా లెజెండ్స్ టీమ్ ముందు 218 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది.
కాగా ఈ సిరీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియన్ లెజెండ్స్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు బరిలో నిలిచాయి. ఇండియన్ లెజెండ్స్ టీమ్‌కు సచిన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సిరీస్‌లో మ్యాచ్‌లన్నీ కాన్పూర్, రాయ్‌పూర్, ఇండోర్, డెహ్రాడూన్ వేదికగా జరుగుతున్నాయి. జియో టీవీ ద్వారా మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చు. తొలి సీజన్‌లో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోనే ఇండియా లెజెండ్స్ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచింది. సెప్టెంబర్ 16 నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ కూడా ప్రారంభం కానుంది.
