NTV Telugu Site icon

ధోని సలహాలను కోహ్లీ పట్టించుకోలేదా?

టీ20 వరల్డ్‌ కప్‌లో పాక్‌పై భారత్‌ ఘోర పరాజయాన్ని ఫ్యాన్స్‌ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా మెంటార్‌ ధోని సలహాలను కోహ్లీ లైట్‌ తీసుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్‌. ధోనీ ఎప్పటిక‌ప్పుడు త‌న సలహాలను యువ బ్యాట్స్‌మెన్‌ ఇషాన్‌ కిషాన్‌తో విరాట్ కోహ్లికి పంపే ప్రయత్నం చేశాడు. ఎప్పుడు కాస్త స‌మ‌యం దొరికినా.. వాట‌ర్ బాటిల్స్ లేదంటే బ్యాట్లు ప‌ట్టుకొని ఫీల్డ్‌లోకి ప‌రుగెత్తుకొచ్చిన ఇషాన్ కిష‌న్‌.. ధోనీ సందేశాన్ని విరాట్‌కు చేర‌వేసే ప్రయ‌త్నం చేశాడు.అయితే కోహ్లి మాత్రం వాటిని ప‌ట్టించుకోకుండా సొంత నిర్ణయాల‌కే క‌ట్టుబ‌డి ఉన్నట్లు మ్యాచ్ చూస్తే అర్థమవుతోంది.

కోహ్లి, పంత్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో త‌ర్వాత ఎవ‌రు బ్యాటింగ్‌కు రావాలో క్రీజులో నుంచే డ్రెస్సింగ్ రూమ్‌కు సందేశం పంపించాడు విరాట్‌. రైట్‌హ్యాండ్ అయిన తాను ఔటైతే హార్దిక్‌, పంత్ ఔటైతే జ‌డేజా రావాల‌న్నది అత‌ని ప్లాన్‌. అందుకు త‌గిన‌ట్లే పంత్ ఔట‌వ‌గానే జ‌డేజా వ‌చ్చాడు. ఈ విష‌యంలో ధోనీ ఇచ్చిన సూచ‌నను కోహ్లి ప‌ట్టించుకోలేదు. 15 ఓవ‌ర్లు పూర్తయినా కూడా కోహ్లి, జ‌డేజా స్కోరు వేగాన్ని పెంచ‌లేక‌పోయారు. ఇది భారీ స్కోరు చేసే అవ‌కాశాన్ని దెబ్బతీసింది.

ఇక ఫీల్డింగ్ స‌మ‌యంలోనూ గాయ‌ప‌డిన పాండ్యా స్థానంలో ఇషాన్ కిష‌న్‌నే ధోనీ పంపించాడు. అప్పుడు కూడా అత‌డు ధోనీ సందేశాల‌ను విరాట్‌కు చేరేవేసే ప్రయ‌త్నం చేశాడు. కానీ కోహ్లి మాత్రం త‌న నిర్ణయాల‌నే ఫాలో అయ్యాడు. తొలి నాలుగు ఓవ‌ర్లు న‌లుగురు బౌల‌ర్లకు ఇవ్వడ‌మ‌న్నది కోహ్లి నిర్ణయ‌మే. ఇది బెడసికొట్టి.. మొద‌ట్లోనే పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టే చాన్స్ టీమిండియా కోల్పోయింది. మొత్తానికి కోహ్లీ సొంత నిర్ణయాలతోనే పాక్‌పై ఓటమిని మూటకట్టుకున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయ్‌. దీనిపై కోహ్లీ స్పందిస్తాడో లేదో… చూడాలి.