India-Born Ireland Pacer Jai Moondra: టీమిండియాపై చారిత్రక టీ20 సిరీస్ విజయాన్ని సాధించి ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచ ఛాంపియన్ భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో పసికూన ఐరిష్ జట్టు కైవసం చేసుకుంది. ఐర్లాండ్ విజయంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జై ముంద్రా కీలక పాత్ర పోషించాడు. తన కచ్చితమైన బౌలింగ్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. రెండో టీ20 మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా ఐర్లాండ్ గెలవడంతో జై కీలక పాత్ర పోషించాడు. అయితే జై ముంద్రా మనోడే కావడం విశేషం. మనోడు ఇప్పుడు పగోడు అయ్యాడు.
బౌలింగ్‌తో భారత్‌ను కట్టడి చేసిన జై:
28 ఏళ్ల జై ముంద్రా ఈ సిరీస్‌లో అసాధారణ ప్రదర్శన చేశాడు. తొలి టీ20లో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ తొలి బంతికే సంజూ శాంసన్‌ను ఔట్ చేసి భారత జట్టుకు షాక్ ఇచ్చాడు. రెండో టీ20లో మరింత చెలరేగిన జై.. మూడు కీలక వికెట్లు పడగొట్టి భారత్ విజయావకాశాలను దెబ్బతీశాడు. మొదటి టీ20లో 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్స్ పడగొట్టాడు. రెండో టీ20లో 4 ఓవర్లలో 32 రన్స్ ఇచ్చి మూడు వికెట్స్ తీశాడు. జై అద్భుత ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.
రాజస్థాన్ నుంచి డబ్లిన్ వరకు:
భారత్‌పై అద్భుత ప్రదర్శన చేసిన జై ముంద్రా మూలాలు భారతదేశానికే చెందినవి. రాజస్థాన్‌లోని తోంక్‌లో జన్మించిన అతడు ఉన్నత విద్య కోసం 2021లో ఐర్లాండ్‌కు వెళ్లాడు. డబ్లిన్‌లోని టెక్నలాజికల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు. అనంతరం కొంతకాలం ఐటీ రంగంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేశాడు. అయితే చిన్నప్పటి నుంచి ఉన్న క్రికెట్‌పై మక్కువ అతడిని మళ్లీ మైదానంలోకి తీసుకొచ్చింది. ఉద్యోగంతో పాటు ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదగాలనే లక్ష్యంతో డబ్లిన్‌లోని లీన్‌స్టర్ క్రికెట్ క్లబ్‌లో చేరి శిక్షణ పొందాడు. తన ప్రతిభతో స్థానిక టోర్నీల్లో మెరుగైన ప్రదర్శనలు చేసి.. ఐర్లాండ్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
తండ్రి కల నెరవేరకపోయినా:
జై ముంద్రా భారత జట్టు తరఫున ఆడాలని అతడి తండ్రి గిరిరాజ్ ముంద్రా ఎప్పుడూ కలలు కనేవారు. అయితే జై ప్రొవిన్షియల్ క్రికెట్‌లో రాణిస్తున్న సమయంలోనే 2024లో ఆయన తండ్రి కన్నుమూశారు. దీంతో తన కుమారుడు భారత్ తరఫున ఆడాలన్న ఆయన కోరిక నెరవేరలేదు. అయినా జై వెనుదిరగలేదు. 2024లో ఐర్లాండ్ ఇంటర్-ప్రొవిన్షియల్ టీ20 టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అనంతరం 2025లో ఐరిష్ పౌరసత్వం పొందిన అతడు.. ఐర్లాండ్ జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ఇప్పుడు భారత్‌పై చారిత్రక సిరీస్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచి ప్రపంచ క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఐర్లాండ్ విజయానికి కొత్త హీరో:
టీమిండియాపై ఐర్లాండ్ సాధించిన ఈ చారిత్రక సిరీస్ విజయంలో జై ముంద్రా పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది. భారతదేశంలో పుట్టి, విదేశాల్లో తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఈ యువ పేసర్ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఉద్యోగ జీవితాన్ని వదిలి క్రికెట్‌ను ఎంచుకున్న అతడి నిర్ణయం ఇప్పుడు ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో ఒక మధురమైన విజయంగా మారింది. మొత్తానికి మనోడే మనల్ని పెద్ద దెబ్బేశాడు.

