Site icon NTV Telugu

IND vs ENG: పాండ్యా వీరవిహారం.. అర్థశతకంతో రాణించిన కోహ్లీ.. ఇంగ్లండ్ లక్ష్యం ఇది!

India Vs Eng

India Vs Eng

India Batting Innings Report Against England In T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి భారత్ 168 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (50), హార్దిక్ పాండ్యా (63) అద్భుతంగా ఆడటం వల్లే.. భారత్ ఆ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. మొదట్లో కేఎల్ రాహుల్ (5) వికెట్ రూపంలో భారత్‌కి గట్టి దెబ్బ తగలడంతో.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడారు. వెంటనే మరో వికెట్ పడనివ్వకుండా, ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొంటూ నిదానంగా ఇన్నింగ్స్ కొనసాగించారు. వీళ్లిద్దరు కలిసి రెండో వికెట్‌కి 45 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అనంతరం రోహిత్ శర్మ (27) ఔట్ అవ్వగా.. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (14) కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి.. విరాట్ కోహ్లీ భారత్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అప్పటివరకూ నిదానంగా ఆడిన కోహ్లీ.. ఒక్కసారిగా చెలరేగిపోయి ఆడాడు.

అయితే.. సరిగ్గా అర్థశతకం చేసిన వెంటనే కోహ్లీ ఔట్ అయ్యాడు. కోహ్లీ క్రీజులో ఉన్నప్పటి నుంచే తన బ్యాట్‌కి పనిచెప్పడం మొదలుపెట్టిన పాండ్యా.. కోహ్లీ ఔటయ్యాక మరింత విజృంభించాడు. సిక్సులు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించాడు. తనని ఔట్ చేసే అవకాశం ఇంగ్లండ్ బౌలర్లకు ఇవ్వకుండా.. చివరివరకూ క్రీజులో నిలబడి తాండవం చేశాడు. చివర్లో పాండ్యా విజృంభణ వల్లే.. భారత్ స్కోరు 168 పరుగులకి చేరిందని చెప్పుకోవడంలో సందేహం లేదు. అయితే.. చివర్లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాండ్యా ఫోర్ కొట్టాడు కానీ, తాను వికెట్లకు తగలడంతో దాన్ని హిట్ వికెట్‌గా ప్రకటించారు. ఒకవేళ పాండ్యా వికెట్లకు తగలకపోయి ఉంటే.. భారత్ ఖాతాలో మరో నాలుగు పరుగులు వచ్చేవి. ఇక ఇంగ్లండ్ బౌలర్ల విషయానికొస్తే.. క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు. ఇంగ్లండ్‌కి 169 పరుగుల లక్ష్యమనేది పెద్ద సవాలుతో కూడుకున్న పని కాదు. అలాగని డిఫెండ్ చేసుకోలేనంత చిన్న స్కోరూ కాదు. ఈ మ్యాచ్ గెలవాలంటే.. భారత బౌలర్ల ప్రతిభపైనే ఆధారపడి ఉంది.

Exit mobile version