Site icon NTV Telugu

India vs Zimbabwe: సెంచరీతో చెలరేగిన శుభ్మన్.. భారత్ క్లీన్ స్వీప్ చేస్తుందా?

India Vs Zimbabwe 3rd Ido

India Vs Zimbabwe 3rd Ido

India Batting Innings Completed In 3rd ODI Against Zimbabwe: ఆల్రెడీ రెండు మ్యాచ్‌లు గెలిచి, సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఈరోజు జింబాబ్వేతో మూడో మ్యాచ్ ఆడుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శుభ్మన్ గిల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఎడా పెడా షాట్లతో జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలుత ఆచితూచి ఆడిన శుభ్మన్.. ఆ తర్వాత భారీ షాట్లతో పరుగుల వర్షం కురిపించాడు. ఇతనితో పాటు చిచ్చరపిడుగు ఇషాన్ కిషన్ కూడా అర్థశతకంతో దుమ్ము దులిపేశాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.

తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ నిదానంగా రాణించారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 15 ఓవర్లో కేఎల్ రాహుల్ బ్రాడ్ ఇవాన్స్ బౌలింగ్‌లో చివరి బంతికి ఔటయ్యాడు. అతని తర్వాత వెంటనే శిఖర్ ధావన్ పెవిలియన్ చేరాడు. అప్పుడు క్రీజులో ఉన్న శుభ్మన్, ఇషాన్.. జింబాబ్వే బౌలర్లకు మరో వికెట్ చిక్కకుండా ఆచితూచి ఆడారు. వీలు చిక్కునప్పుడల్లా భారీ షాట్లతో చెలరేగుతూ.. వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. మూడో వికెట్‌కి 140 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అనంతరం ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. అయితే.. అతని తర్వాత వచ్చిన బ్యాట్స్మన్లెవరూ పెద్దగా రాణించలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చారు.

కానీ.. శుభ్మన్ మాత్రం తడబడలేదు. అప్పటికే క్రీజులో కుదురుకున్న అతడు, పరుగుల వర్షం కురిపిస్తూ భారత్ స్కోర్ బోర్డును పెంచుకుంటూ వెళ్లాడు. ఆ జోష్‌లోనే చివరి 50వ ఓవర్‌లో శుభ్మన్ ఔటయ్యాడు. శార్దూల్ కూడా భారీ షాట్ కొట్టబోయే, వెంటనే వెనుదిరిగాడు. దీంతో.. మొత్తం 50 ఓవర్లలో భారత్ 289 పరుగులు చేయగలిగింది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ ఫైఫర్ (5 వికెట్లు)తో చరిత్ర సృష్టించాడు. విక్టర్, ల్యూక్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇప్పటివరకూ జరిగిన రెండు మ్యాచుల్లో జింబాబ్వే 200 పరుగుల మైలురాయిని అందుకోలేదు. కాబట్టి, ఈ లక్ష్యం వారికి పెద్దదే! చూస్తుంటే, ఈ మ్యాచ్ కూడా భారత్‌దేనని అనిపిస్తోంది. అదే జరిగితే, క్వీన్ స్వీప్ చేసినట్టే!

Exit mobile version