Site icon NTV Telugu

Common Wealth Games 2022: రెజ్లింగ్‌లో పతకాల జోరు.. పసిడి పట్టు పట్టిన రెజ్లర్లు

Common Wealth Games

Common Wealth Games

Common Wealth Games 2022: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో మూడు స్వర్ణాలను గెలుచుకున్న భారత్‌కు శుక్రవారం రెజ్లింగ్‌లో ఓ అద్భుతమైన రోజు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్‌ గేమ్స్‌లో శుక్రవారం ఆరు పతకాలతో అదరగొట్టారు. స్టార్‌ రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, దీపక్‌ పూనియా, సాక్షి మలిక్‌ స్వర్ణ పతకాలతో సాధించగా… అన్షు మలిక్‌ రజతం… దివ్య కక్రాన్, మోహిత్‌ గ్రెవాల్‌ కాంస్య పతకాలు సంపాదించారు. కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఇప్పటివరకు భారత అథ్లెట్లు 26 పతకాలు సాధించగా.. అందులో 9 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. బ్యాడ్మింటన్, టేబుల్‌ టెన్నిస్‌ ఈవెంట్స్‌లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల దిశగా మరో అడుగు ముందుకేశారు. రెజ్లింగ్‌ ఈవెంట్‌ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్‌ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో బజరంగ్‌ పూనియా (65 కేజీలు), దీపక్‌ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా… మోహిత్‌ గ్రెవాల్‌ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ (62 కేజీలు) మూడో ప్రయత్నంలో కామన్వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించగా… అన్షు (57 కేజీలు) రజతం… దివ్య కక్రాన్‌ (68 కేజీలు) కాంస్యం సొంతం చేసుకున్నారు.

టైటిల్ నిలబెట్టుకున్న బజరంగ్: శుక్రవారం పురుషుల 65 కేజీల విభాగంలో బజ్‌రంగ్‌ పునియా 9-2తో లాచ్లన్‌ మెక్‌నీల్‌ (కెనడా)ను చిత్తుచేసి టైటిల్‌ నిలబెట్టుకున్నాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ బజరంగ్‌కు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. చివర్లో మరింత దూకుడు ప్రదర్శించి వరుసగా రెండో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా అతనికిది మూడో పతకం. తొలి రౌండ్‌లో లోవీ బింగామ్‌ (నౌరూ)పై, క్వార్టర్‌ ఫైనల్లో జీన్‌ గలియాన్‌ (మారిషస్‌)పై, సెమీఫైనల్లో జార్జి రామ్‌ (ఇంగ్లండ్‌)పై బజరంగ్‌ గెలిచాడు. స్వర్ణం గెలిచే క్రమంలో బజరంగ్‌ తన ప్రత్యర్థులకు కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఇవ్వడం విశేషం. 2014లో 61 కేజీల విభాగంలో రజతం నెగ్గిన అతను.. నాలుగేళ్ల క్రితం 65 కేజీల ఛాంపియన్‌గా నిలిచాడు.

పసిడి పట్టేసిన సాక్షి​: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ మెరిసింది. మహిళల రెజ్లింగ్‌ ఫ్రీస్టైల్‌ 62 కేజీల విభాగంలో సాక్షి మాలిక్‌ పసిడి పట్టేసింది. ఫైనల్‌లో కెనడాకు చెందిన అనా గోడినెజ్‌ను సాక్షి మట్టికరిపించింది. కానీ తొలి మూడు నిమిషాలు ముగిసే సరికి 0-4తో వెనకబడింది. విరామానంతరం ఒక్కసారిగా ప్రత్యర్థిని ఎత్తిపడేసి, పైకి లేవకుండా అలాగే మ్యాట్‌కు అదిమి పట్టిన సాక్షి విజయాన్ని అందుకుంది. 2014 కామన్వెల్త్‌ క్రీడల్లో సాక్షి రజతం, 2018లో కాంస్యం సాధించగా, తాజాగా స్వర్ణ పతక విజేతగా నిలవడం విశేషం.

పూనియా గోల్డ్: తొలిసారి కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొన్న దీపక్‌ పూనియా ఫైనల్లో 3–0తో మొహమ్మద్‌ ఇనామ్‌ (పాకిస్తాన్‌)పై గెలిచాడు. సెమీఫైనల్లో దీపక్‌ 3–1తో అలెగ్జాండర్‌ మూర్‌ (కెనడా)పై, క్వార్టర్‌ ఫైనల్లో 10–0తో కసెబామా (సియరీ లియోన్‌)పై, తొలి రౌండ్‌లో 10–0తో మాథ్యూ ఒక్జెనామ్‌ (న్యూజిలాండ్‌)పై విజయం సాధించాడు. 125 కేజీల కాంస్య పతక పోరులో మోహిత్‌ గ్రెవాల్‌ ‘బై ఫాల్‌’ పద్ధతిలో ఆరోన్‌ జాన్సన్‌ (జమైకా)పై గెలుపొందాడు. మహిళల 57 కేజీల ఫైనల్లో పుట్టిన రోజు నాడు అన్షు 3-7తో ఒడునాయో (నైజీరియా) చేతిలో ఓడి రజతం అందుకుంది. 68 కేజీల విభాగంలో దివ్య కక్రాన్‌ కాంస్యం గెలిచింది. పతక పోరులో ఆమె టోంగా రెజ్లర్‌ టైగర్‌ లైలీని ఓడించింది. 125 కేజీల కాంస్య పోరులో మోహిత్‌ గ్రెవాల్‌ 6-0తో అరోన్‌ (జమైకా)పై విజయం సాధించాడు.

మరోవైపు పురుషుల లాన్ బౌల్స్ ఫోర్స్ జట్టు ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకోవడంతో భారత్‌కు పతకం ఖాయమైంది. పెనాల్టీ షూటౌట్‌లో రిఫరీ నుండి వచ్చిన వివాదాస్పద నిర్ణయాన్ని అనుసరించి అటాకర్లు తక్కువ ప్రదర్శనతో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్‌లో భారత మహిళల హాకీ జట్టు ఓటమి పాలైంది. స్టార్ ఇండియన్ ప్యాడ్లర్ మనిక బాత్రా క్వార్టర్ ఫైనల్స్ ఈవెంట్‌లో నిరాశతో వెనుదిరిగింది.

Exit mobile version