NTV Telugu Site icon

Common Wealth Games 2022: సత్తా చాటుతున్న భారత ఆటగాళ్లు.. ఖాతాలో మూడు స్వర్ణాలు

Common Wealth Games

Common Wealth Games

Common Wealth Games 2022: కామన్‌వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు తమ సత్తాను చాటుతున్నారు. ఈ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు స్వర్ణాలు భారత్ తన ఖాతాలో వేసుకోగా.. ఆ మూడు కూడా వెయిట్‌లిఫ్టింగ్‌లో వచ్చినవే కావడం గమనార్హం. తొలి స్వర్ణాన్ని మీరాబాయి చాను అందించగా.. రెండోది జెరెమీ లాల్రినుంగా.. మూడో స్వర్ణాన్ని అచింత షూలి అందించాడు. 73 కేజీల ఫైనల్లో అచింత షూలి పసిడి సాధించాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసిన ఈ పోటీలో ఆరంభం నుంచి స్థిరంగా బరువులు ఎత్తిన 20 ఏళ్ల ఈ బెంగాల్‌ లిఫ్టర్‌ ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనా వారిని వెనక్కి నెట్టి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. స్నాచ్‌ తొలి ప్రయత్నంలోనే 137 కేజీల బరువు లిఫ్ట్‌ చేసిన అచింత.. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 140 కేజీలు.. మూడో ప్రయత్నంలో 143 ఎత్తి గేమ్స్‌ రికార్డును సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లోనూ తొలి ప్రయత్నంలో 166 కేజీలు తేలిగ్గా ఎత్తిన అచింత.. రెండో లిఫ్ట్‌లో 170 కేజీలు ఎత్తడంలో విఫలమయ్యాడు. అయితే మూడో ప్రయత్నంలో 170 కేజీలు లిఫ్ట్‌ చేసి మొత్తం మీద 313 కేజీలతో పసిడి సొంతం చేసుకున్నాడు.

పంతొమ్మిదేళ్లకే పసిడి: అంతకుముందు ఆదివారం 19 ఏళ్ల కుర్రాడు జెరెమీ లాల్రినుంగా దేశానికి రెండో పసిడి అందించగా.. బింద్యారాణి రజతం గెలుచుకుంది. ఆదివారం పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్రినుంగా పూర్తి ఆధిపత్యం చలాయించి విజేతగా నిలిచాడు. మొత్తం 300 కేజీల బరువెత్తి సరికొత్త కామన్వెల్త్‌ క్రీడల రికార్డునూ సృష్టించాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన మహిళల 55 కిలోల విభాగం పోటీలో బింద్యారాణి దేవి కేవలం ఒక్క కిలో తేడాతో రెండో స్థానానికి పరిమితమైంది. 202 కేజీల ప్రదర్శనతో వెండి పతకం కైవసం చేసుకుంది. ఇప్పటికే వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను స్వర్ణం, సంకేత్‌ రజతం, గురురాజ కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే.

అదరహో అనిపించిన మహిళల జట్టు: బర్మింగ్ హామ్ వేదికగా నిర్వహిస్తున్న కామన్వెల్త్ గేమ్స్‌లో టీమిండియా మహిళల జట్టు అదరగొట్టింది. 100 కోట్ల మందికి పైగా భారతీయులను సంతోషంలో ముంచెత్తింది. ఆదివారం జరిగిన మహిళల టీ20లో దాయాది పాకిస్థాన్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 100 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11.4 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో దేశమంతటా సంబరాలు జరుగుతున్నాయి. టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. కొడితే సిక్సర్‌ లేదంటే బౌండరీ అన్నట్టుగా బంతిని బాదేసింది.

బ్యాడ్మింటన్‌లో..  బ్యాడ్మింటన్‌లో భారత మిక్స్‌డ్‌ జట్టు కూడా క్రీడల్లో అద్భుతంగా రాణిస్తోంది. భారత్‌కు చెందిన బృందం అలవోకగా సెమీస్‌ చేరింది. క్వార్టర్స్‌లో భారత్‌ 3-0తో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సుమీత్‌రెడ్డి 2-0తో జెరార్డ్‌-జోర్డాన్‌పై గెలవగా, పురుషుల సింగిల్స్‌లో అంతే తేడాతో లక్ష్యసేన్‌ గెలిచాడు. ఆపై మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌ భారత్‌కు విజయాన్ని అందించింది.

క్వార్టర్ ఫైనల్లో నిఖత్: భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో శుభారంభం చేసింది. మహిళల 50 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్‌లో నిఖత్‌.. హెలెనా ఇస్మాయిల్‌ (మొజాంబిక్‌)ను నాకౌట్‌ చేసింది. బౌట్‌ ఆసాంతం దూకుడుగా ఆడిన నిఖత్‌.. ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడింది. క్వార్టర్స్‌లో టోరీ గార్టన్‌ (న్యూజిలాండ్‌)తో నిఖత్‌ పోటీపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఈ తెలంగాణ అమ్మాయి పతకం ఖాయం చేసుకుంటుంది. మరోవైపు పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్విమ్మర్ శ్రీహరి నటరాజ్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు.

హాకీ జట్టు శుభారంభం: టేబుల్‌టెన్నిస్‌లో భారత పురుషుల జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో భారత్‌ 3-0తో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. డబుల్స్‌లో హర్మీత్‌-సత్యన్‌ గెలవగా, ఆ తర్వాత రెండు సింగిల్స్‌లో శరత్‌కమల్, సత్యన్‌ విజయాలు అందుకుని జట్టును సెమీస్‌ చేర్చారు. లాన్‌బౌల్స్‌ మహిళల ఫోర్స్‌ విభాగంలో భారత్‌ తొలిసారి సెమీస్‌ చేరింది. పురుషుల హాకీలో భారత్ తన తొలి మ్యాచ్‌లో భారీ విజయం సాధించింది. ఘనాను 11-0 గోల్స్‌తో చిత్తుగా ఓడించింది.