India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్‌ పూర్తి మెడల్‌ ట్యాలీ ఇదే

  • ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు
  • చివరి రోజుల్లో అదరగొట్టి 85 పతకాలతో టాప్‌-5లోకి
Asian Games 2026

Asian Games 2026

India Asian Games 2026 Medal Tally: ఐచి-నాగోయా ఆసియా క్రీడల్లో భారత జట్టు ప్రస్థానం ముగిసింది. చివరి రోజున పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని సాధించడంతో భారత్‌ తన ఖాతాలో 21వ స్వర్ణం, మొత్తంగా 85 పతకాలు జోడించుకుంది. మలేషియాపై పురుషుల హాకీ జట్టు 5-1 తేడాతో ఘన విజయం సాధించి భారత్‌ క్యాంపెయిన్ ను విజయవంతంగా ముగించింది. ఆదివారం ఆసియా క్రీడల ముగింపు వేడుకలు జరగనున్నాయి. చివరి వరకు ఉత్కంఠగా సాగిన భారత పతకాల వేటలో చివరి రెండు రోజుల్లో అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బాక్సింగ్‌, రెజ్లింగ్‌, హాకీ, క్రికెట్‌ విభాగాల్లో వచ్చిన విజయాలు భారత్‌ను మళ్లీ టాప్‌-5లో నిలబెట్టాయి.

గత ఆసియా క్రీడలతో పోలిస్తే తగ్గిన పతకాలు

భారత్‌ ఈసారి మొత్తం 85 పతకాలు సాధించింది. అయితే గత హాంగ్‌జౌ ఆసియా క్రీడలతో పోలిస్తే ఇది 21 పతకాలు తక్కువ. హాంగ్‌జౌ 2022 క్రీడల్లో భారత్‌ తొలిసారి 100 పతకాల మార్కును దాటి 106 పతకాలు సాధించింది. అదే సమయంలో స్వర్ణ పతకాల సంఖ్య కూడా గతంతో పోలిస్తే ఈసారి ఏడు తగ్గాయి. అయినప్పటికీ ఐచి-నాగోయా క్రీడల్లో భారత ప్రదర్శన పూర్తిగా నిరాశాజనకంగా మాత్రం లేదు. ఆరంభంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోయినా, చివరి దశలో భారత క్రీడాకారులు వరుస విజయాలతో సత్తా చాటారు.

చివరి రోజుల్లో పెరిగిన భారత్‌ జోరు

గురువారం వరకు భారత్‌ కేవలం 10 స్వర్ణ పతకాలతో పతకాల పట్టికలో టాప్‌-10కు బయట ఉండేది. దీంతో భారత ప్రదర్శనపై అంచనాలు తగ్గాయి. అయితే చివరి రెండు రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హాకీ, క్రికెట్‌ జట్లు స్వర్ణ పతకాలు సాధించగా.. ఆర్చరీ, బాక్సింగ్‌, రెజ్లింగ్‌లోనూ భారత ఆటగాళ్లు అదరగొట్టారు. ఈ చివరి దశలో వచ్చిన విజయాలతో భారత్‌ మరో 11 స్వర్ణ పతకాలను తన ఖాతాలో వేసుకుని టాప్‌-5లోకి దూసుకెళ్లింది.

ఏ క్రీడలో ఎన్ని పతకాలు?

భారత్‌కు అత్యధిక పతకాలు అథ్లెటిక్స్‌లో 24, ఆ తర్వాత షూటింగ్‌లో 15, ఆర్చరీలో 9 వచ్చాయి.

క్రీడ. స్వర్ణం. రజతం. కాంస్యం. మొత్తం
ఆర్చరీ -5- 2- 2- 9
అథ్లెటిక్స్ -1- 9- 14 -24
బ్యాడ్మింటన్- 0 -0 -1 -1
బాక్సింగ్- 3- 0- 3 -6
క్రికెట్ -2 -0 -0- 2
గోల్ఫ్- 1- 1- 0- 2
హాకీ- 2 -0- 0 -2
కబడ్డీ -2- 0 -0- 2
కురాష్ -0 -0- 1- 1
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్- 0- 0 -1 -1
రోయింగ్ -0- 0- 1 -1
సెయిలింగ్ -0 -1 -2 -3
సెపక్‌టక్రా -0 -0- 1- 1
షూటింగ్ -3 -8 -4 -15
సాఫ్ట్ టెన్నిస్ -0 -0 -1- 1
స్క్వాష్ -0-2- 3 -5
టేబుల్ టెన్నిస్ -0 -0- 1-1
వెయిట్‌లిఫ్టింగ్ -0 -1 -0- 1
రెజ్లింగ్ -2 -2- 2 -6
వుషు -0 -1 -0 -1
మొత్తం -21 -27- 37 -85

భారత్‌కు స్వర్ణ పతకాలు అందించిన వారు

భారత్‌ సాధించిన 21 స్వర్ణాల్లో క్రికెట్‌, కబడ్డీ, హాకీ, ఆర్చరీ, షూటింగ్‌, బాక్సింగ్‌, రెజ్లింగ్‌, అథ్లెటిక్స్‌, గోల్ఫ్‌ క్రీడాకారులు కీలక పాత్ర పోషించారు.

మహిళల క్రికెట్‌ జట్టు
కమల్‌జీత్‌, సురుచి సింగ్‌ – షూటింగ్‌
మహిళల కబడ్డీ జట్టు
పురుషుల కబడ్డీ జట్టు
నీరూ ధాండా – మహిళల ట్రాప్‌
మహిళల 4×400 మీటర్ల రిలే జట్టు
జ్యోతి సురేఖ వెన్నం, ప్రితికా ప్రదీప్‌, చికితా తనిపర్తి – ఆర్చరీ
చికితా తనిపర్తి, సాహిల్‌ జాధవ్‌ – మిక్స్‌డ్‌ కాంపౌండ్‌
కాయన్‌ చెన్‌కాయ్‌, నీరూ ధాండా – మిక్స్‌డ్‌ ట్రాప్‌
సాహిల్‌ జాధవ్‌ తదితరులు – పురుషుల కాంపౌండ్‌ టీమ్‌
అంకిత భక్త, కుంకుమ మొహోత్‌, కీర్తి శర్మ – మహిళల రికర్వ్‌ టీమ్‌
లవ్లీనా బోర్గోహైన్‌ – మహిళల 75 కేజీలు
పర్వీన్‌ హుడా – మహిళల 65 కేజీలు
అంకుశ్‌ పంఘాల్‌ – పురుషుల 80 కేజీలు
సుజీత్‌ కలకల్‌ – పురుషుల 65 కేజీల రెజ్లింగ్‌
మహిళల హాకీ జట్టు
కుంకుమ మొహోత్‌ – వ్యక్తిగత రికర్వ్‌
ప్రణవి ఉర్స్‌ – మహిళల గోల్ఫ్‌
పురుషుల క్రికెట్‌ జట్టు
అమన్‌ సెహ్రావత్‌ – పురుషుల 57 కేజీల రెజ్లింగ్‌
పురుషుల హాకీ జట్టు

అథ్లెటిక్స్‌ కీలక బలంగా

భారత్‌కు అత్యధికంగా 24 పతకాలు అథ్లెటిక్స్‌ నుంచే వచ్చాయి. ఇందులో ఒక స్వర్ణం, 9 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. గుల్వీర్‌ సింగ్‌, తజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌, ఎంసీ శ్రీశంకర్‌, అంసి సోజన్‌, సర్వేశ్‌ కుశారే, పారుల్‌ చౌధరి తదితరులు పతకాలు సాధించి భారత అథ్లెటిక్స్‌ బలాన్ని చాటారు.

షూటింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శన

షూటింగ్‌ నుంచి భారత్‌కు 15 పతకాలు వచ్చాయి. ఇందులో 3 స్వర్ణాలు, 8 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. ఇలావెనిల్‌ వలరివన్‌, హిమాంశు ధిల్లాన్‌, రుద్రాంక్ష్‌ పాటిల్‌, ఈషా సింగ్‌, నీరూ ధాండా తదితరులు వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్లలో సత్తా చాటారు.

ఆర్చరీలో భారత్‌ సత్తా

ఆర్చరీలో భారత్‌ 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో మొత్తం 9 పతకాలు సాధించింది. జ్యోతి సురేఖ వెన్నం, కుంకుమ మొహోత్‌, సాహిల్‌ జాధవ్‌, ధీరజ్‌ బొమ్మదేవర తదితరులు కీలక విజయాలు అందించారు.

చివరి దశ విజయాలతో ఘన ముగింపు

ఈ ఆసియా క్రీడల్లో భారత్‌ ప్రారంభ దశలో కొంత తడబడినా, చివరి రోజుల్లో అద్భుతమైన పునరాగమనం చేసింది. ముఖ్యంగా క్రికెట్‌, హాకీ, ఆర్చరీ, బాక్సింగ్‌, రెజ్లింగ్‌ విభాగాల్లో వచ్చిన విజయాలు భారత్‌ పతకాల సంఖ్యను గణనీయంగా పెంచాయి. చివరగా పురుషుల హాకీ జట్టు మలేషియాపై 5-1 ఘన విజయం సాధించి స్వర్ణ పతకాన్ని అందుకోవడంతో భారత క్యాంపెయిన్ విజయోత్సాహంతో ముగిసింది.