శ్రీలంక వేదికగా జరుగుతోన్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్-ఎ జట్టు విజయాన్ని నమోదు చేసింది. బలమైన భారత్-ఎ జట్టుతో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో వర్షం అంతరాయం కలిగించినప్పటికీ, అఫ్గానిస్థాన్-ఎ జట్టు డక్వర్త్ లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం 4 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.
హాఫ్ సెంచరీలతో రాణించిన బ్యాటర్లు
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ జట్టు నిర్ణీత 49 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కేవలం 69 బంతుల్లో 14 ఫోర్లతో 84 పరుగులు చేసి జట్టుకు భారీ పునాది వేశాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లతో 44 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (66 పరుగులు, 80 బంతుల్లో), కెప్టెన్ తిలక్ వర్మ (66 పరుగులు, 73 బంతుల్లో) బాధ్యతాయుత హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో సూర్యాన్ష్ షెడ్గే (40) వేగంగా ఆడటంతో భారత్ 349 పరుగుల భారీ మార్కును అందుకుంది. అఫ్గాన్ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్‌జాయ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టగా, ఫర్మానుల్లా సఫీ 3 వికెట్లు తీశాడు.
వర్షం అంతరాయం..
భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగాల్సిన అఫ్గానిస్థాన్-ఎ ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందే వర్షం మళ్లీ అంతరాయం కలిగించింది. దీంతో అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను 38 ఓవర్లకు కుదించి, డీఎల్ ఎస్ ప్రకారం.. 294 పరుగులుగా నిర్ణయించారు. కఠినమైన లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టుకు భారత బౌలర్లు అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్ చెరో వికెట్ తీసి ప్రారంభంలోనే షాక్ ఇచ్చారు.
అయితే ఆ తర్వాత అఫ్గాన్ బ్యాటర్లు ఇమ్రాన్ మిర్, బహీర్ షా భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నిలకడగా ఆడారు. అఫ్గాన్ జట్టు 25.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి పూర్తి నియంత్రణలో ఉన్న సమయంలో మ్యాచ్‌కు మళ్లీ వర్షం తీవ్రంగా అంతరాయం కలిగించింది. పిచ్‌పై కవర్లు వేసి ఆటను నిలిపివేసే సమయానికి అఫ్గాన్ ఓపెనర్ ఇమ్రాన్ మిర్ 75 పరుగులతో, బహీర్ షా 51 పరుగులతో క్రీజులో నాటౌట్‌గా ఉన్నారు.
డీఎల్‌ఎస్ సమీకరణాలతో అఫ్గాన్ విజయం..
చీకటి పడటం, వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేసి, ఫలితాన్ని తేల్చడానికి డీఎల్‌ఎస్ (DLS) పద్ధతిని ఆశ్రయించారు. ఆట నిలిచే సమయానికి డీఎల్‌ఎస్ పరంగా ఉండాల్సిన స్కోరు కంటే అఫ్గానిస్థాన్-ఎ జట్టు 4 పరుగులు ముందుండటంతో, అంపైర్లు అఫ్గాన్‌ను విజేతగా ప్రకటించారు. ఈ విజయంతో అఫ్గానిస్థాన్-ఎ జట్టు టోర్నీలో బోణీ కొట్టి, శ్రీలంక-ఎ జట్టుతో జరగబోయే తదుపరి మ్యాచ్‌కు మంచి ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది.

