Abdul Samad on Pakistan A victory Over India A: ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్ ‘ఏ’పై పాకిస్థాన్ ‘ఏ’ ఘన విజయం సాధించింది. ఆదివారం దోహాలో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.2 ఓవర్లలో 313 పరుగులు చేసింది. అనంతరం టీమిండియాను 265 పరుగులకే పరిమితం చేసి.. 48 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంపై పాకిస్థాన్ ‘ఏ’ కెప్టెన్ అబ్దుల్ సమద్ ఆనందం వ్యక్తం చేశాడు. భారత్‌పై విజయం ఎప్పుడూ ప్రత్యేకమే అని, తన సారథ్యంలో మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉందన్నాడు. భారత్‌పై తమ బ్యాటర్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు.
మా బ్యాటర్లు అద్భుతం:
మ్యాచ్ అనంతరం మాట్లాడిన అబ్దుల్ సమద్.. జట్టులోని ఆటగాళ్లంతా సమష్టిగా రాణించడంతో మంచి స్కోరు సాధించగలిగామని తెలిపాడు. ఈ పిచ్‌పై 313 పరుగులు చేయడం భారీ స్కోరేనని అభిప్రాయపడ్డాడు.’షమిల్, మాజ్ తొలి బంతి నుంచే టీమిండియాపై ఒత్తిడి తీసుకొచ్చిన తీరు అద్భుతం. ఆ తర్వాత హసన్ నవాజ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. నేను, ఫర్హాన్ యూసఫ్, ఇమ్రాన్ రందావా కూడా మెరుపులు మెరిపించాం. ఈరోజు మా జట్టు ఆటగాళ్లంతా అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. స్కోరు బోర్డుపై భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఈ పిచ్‌పై 313 పరుగులు చేయడం చాలా గొప్ప విషయం’ అని అన్నాడు.
తప్పక గెలుస్తామని ముందే అనుకున్నాం:
టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకోవడంపై అబ్దుల్ సమద్ స్పందిస్తూ.. పిచ్ పొడిగా కనిపించడంతో ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించాడు. ‘పిచ్ పొడిగా కనిపించింది. అందుకే టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ చేయాలని ఇజాజ్ భాయ్, నేను నిర్ణయించుకున్నాం. భారత్ మంచి జట్టు కాబట్టి.. ఈ పిచ్‌పై 300కు పైగా పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ వికెట్‌పై 300కు పైగా స్కోరు చేయడం అంటే విజయానికి చేరువయినట్లే. అనుకున్న విధంగానే 300 స్కోర్ చేశాం. తప్పక గెలుస్తామని ముందే అనుకున్నాం’ అని తెలిపాడు.
అలీ రజా బౌలింగ్ సూపర్:
బౌలర్ల ప్రదర్శనపైనా పాక్ కెప్టెన్ అబ్దుల్ సమద్ ప్రశంసలు కురిపించాడు. అలీ రజా మరోసారి అద్భుతమైన ఆరంభాన్ని అందించాడని చెప్పాడు. గత మ్యాచ్‌లో యూఏఈపై, ఈ మ్యాచ్‌లో భారత్‌పై అతడు మంచి బౌలింగ్ చేశాడని పేర్కొన్నాడు. అహ్మద్ డానియల్‌తో పాటు మిగతా బౌలర్లు కూడా తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారని తెలిపాడు. ఇమ్రాన్ రంధావా కూడా టీమిండియా బ్యాటర్లపై ఒత్తిడి తీసుకొచ్చాడని అన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆటగాళ్లంతా సమష్టిగా రాణించడంతో భారత్ ‘ఏ’పై విజయం సాధించామని సమద్ పేర్కొన్నాడు. జట్టు ప్రణాళికలను మైదానంలో ఆటగాళ్లు చక్కగా అమలు చేయడం ఈ గెలుపునకు ప్రధాన కారణమని అతడు తెలిపాడు.

