Ajinkya Rahane Slams Shubman Gill: న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ.. ఐదో రోజు ఆటలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రనౌట్ చేసే అవకాశాన్ని చేజార్చిన పేసర్ ఆకాష్ దీప్‌పై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మైదానంలోనే అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే స్పందిస్తూ.. గిల్ తీరును ప్రశ్నించాడు. ఆ సమయంలో ఆకాష్ దీప్‌ను మందలించకుండా.. అతడికి మద్దతుగా నిలవాల్సిందని అభిప్రాయపడ్డాడు. గిల్.. నువ్ ఓ కెప్టెన్ అని, మైదానంలోనే హుందాగా ప్రవర్తించాల్సింది అని జింక్స్ సూచించాడు.
మైదానంలోనే ఆగ్రహం:
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 71వ ఓవర్ తొలి బంతికి రనౌట్ చేసే అవకాశం టీమిండియాకు వచ్చింది . డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ క్రీజులో ఉండగా.. వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని మిచెల్ మిడ్ ఆన్ దిశగా ఆడాడు. సింగిల్ తీసేందుకు ప్రయత్నించగా.. అప్పటికే సగం పిచ్ దాటిన మిచెల్‌ను బ్లండెల్ వెనక్కి పంపించాడు. అయితే మిడ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆకాష్ దీప్ బంతిని సరిగ్గా అందుకుని.. స్ట్రైకర్ ఎండ్‌కు వేగంగా విసరలేకపోయాడు. దీంతో భారత్‌కు రనౌట్ చేసే అవకాశం చేజారింది. ఈ పరిణామంతో అసహనానికి గురైన కెప్టెన్ గిల్.. ఆకాష్ దీప్‌పై మైదానంలోనే ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మందలించడానికి బదులుగా:
ఈ ఘటనపై సోనీ స్పోర్ట్స్‌లో మాట్లాడిన అజింక్య రహానే.. ఫీల్డర్ తప్పిదం చేసినప్పుడు కెప్టెన్, సహచర ఆటగాళ్లు అతడికి అండగా నిలవడం చాలా ముఖ్యమని పేర్కొన్నాడు. గిల్ ఆకాష్ దీప్‌ను మందలించడానికి బదులుగా ప్రోత్సహించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఒక తప్పిదం తర్వాత బౌలర్ దృష్టి మరలితే, తదుపరి బంతులపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉందని వివరించాడు. ‘బంతిపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఎక్కడ బౌలింగ్ చేయాలనే ఆలోచనకు వెళ్లిపోతారు. ఇలాంటి పొరపాట్లు సహజం. అయితే అలాంటి సమయంలో ఫీల్డర్‌కు సహచరుల మద్దతు చాలా అవసరం. ఆకాష్ దీప్‌కు ఆ సమయంలో వెళ్లి బౌలింగ్ చేయి.. వికెట్ తీసేది నువ్వే అని ధైర్యం చెప్పాలి. జరిగిన తప్పును మార్చలేం. దాన్ని మర్చిపోయి ప్రస్తుత ఆటపై దృష్టి పెట్టాలి. ఆ తర్వాత అద్భుతమైన క్యాచ్ పట్టవచ్చు లేదా రెండు మంచి బంతులు వేసి వికెట్ తీయవచ్చు. అందుకే సహచరుల మద్దతు ఎంతో ముఖ్యం’ అని రహానే పేర్కొన్నాడు.
న్యూజిలాండ్ అద్భుత పోరాటం:
మరోవైపు డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్ తరఫున అద్భుతంగా పోరాడారు. వీరిద్దరూ కలిసి 43 ఓవర్లు ఆడి 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 239/5 స్కోరు చేసింది. మిచెల్ 186 బంతుల్లో 49 పరుగులు చేసి అజేయంగా ఉండగా.. ఫిలిప్స్ 126 బంతుల్లో 26 రన్స్ చేసి కీలకంగా నిలిచాడు. ఈ ఇద్దరి పోరాటంతో చివరి రోజు భారత జట్టు విజయంపై పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. చివరకు తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ చేరేందుకు టీమిండియాకు అన్ని దారులు దాదాపు మూసుకుపోవడం మరింత నిరాశ కలిగించింది.

