Site icon NTV Telugu

IND vs NZ 4th T20: అతడు నంబర్ 1 బౌలర్‌.. రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితం చేయడం సరికాదు!

Varun Chakravarthy

Varun Chakravarthy

మరికొన్ని గంటల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు విశాఖపట్నం వేదికగా నాలుగో టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇప్పటికే మొదటి మూడు మ్యాచుల్లో విజయం సాధించిన భారత్.. 3-0 తేడాతో సిరీస్‌ను ఖాయం చేసుకుంది. అయినప్పటికీ ఈ సిరీస్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఎందుకంటే ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో అన్ని మ్యాచుల్లోనూ ఆడించాలంటూ సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వరల్డ్‌కప్‌కు ముందు ప్రధాన బౌలర్లను రిజర్వ్‌ బెంచ్‌లో ఉంచాల్సిన అవసరం ఉందన్నాడు.

‘న్యూజిలాండ్‌తో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ పూర్తయిన వెంటనే టీ20 వరల్డ్‌కప్ 2026 జరగనుంది. వరుణ్ చక్రవర్తి మన ప్రధాన బౌలర్. పొట్టి ఫార్మాట్‌లో బౌలర్ రిథమ్ చాలా కీలకం. అతడిని వరల్డ్‌కప్‌కు ముందు జరగబోయే మ్యాచ్‌లలో రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేయడం సరైన నిర్ణయం కాదు. మేము కేవలం నీకు విశ్రాంతి ఇస్తున్నాం, రవి బిష్ణోయ్‌ను పరీక్షిస్తున్నామని చెప్పినా.. అది వరుణ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పలేం’ అని అజింక్య రహానే అన్నాడు. ప్రస్తుతం వరుణ్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 804 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.

Also Read: IND vs NZ 4th T20: నాలుగో టీ20 తుది జట్టులో కీలక మార్పులు.. హార్దిక్, బుమ్రా దూరం!

ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్‌కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు వరుణ్ చక్రవర్తి ప్రధాన ఆయుధంగా మారనున్నాడు. మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే సామర్థ్యం అతడికి అదనపు బలం. ఇప్పటికే న్యూజిలాండ్‌పై 3-0తో సిరీస్ గెలిచిన భారత్.. చివరి రెండు టీ20ల్లో ప్రయోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన వరుణ్.. విశ్రాంతి పేరుతో మూడో టీ20లో ఆడలేదు. అతడి స్థానంలో రవి బిష్ణోయ్‌ను తుది జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపైనే రహానే వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Exit mobile version