Shreyas Iyer Reaction on IND Defeat vs NZ: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 244 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. మౌంట్ మాంగనూయిలోని బే ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్ 50 ఓవర్లలో 333 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 26.4 ఓవర్లలో కేవలం 89 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్ 244 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 6 వికెట్లు తీసిన మాట్ హెన్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని అన్నాడు. ‘తొలి ఇన్నింగ్స్, రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ ప్రవర్తనలో చాలా తేడా కనిపించింది. అయితే మాట్ హెన్రీకి పూర్తి క్రెడిట్ ఇవ్వాల్సిందే. తొలి బంతి నుంచే సరైన ప్రాంతాల్లో బంతులు వేస్తూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి ఓవర్‌లోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అక్కడే మేము వెనకపడిపోయాం. బౌలింగ్‌లో షార్ట్ బాల్స్‌తో పాటు దాదాపు అన్ని రకాల బంతులు హెన్రీ వేశాడు. మాకు కోలుకునే అవకాశమే లేకుండా పోయింది. అయితే న్యూజిలాండ్ బ్యాటర్లు బంతిని పైకి ఆడుతూ పరుగులు సాధించారు. 330 పరుగులు చేసిన తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉందని మేము భావించాము. ఫీల్డింగ్‌లో కొన్ని క్యాచ్‌లు జారవిడిచాం. అయితే క్రికెట్‌లో ఇలాంటివి సహజమే’ అని శ్రేయస్ పేర్కొన్నాడు.
మొదటి ఇన్నింగ్స్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నప్పుడు లక్ష్యాన్ని సులభంగానే ఛేదించగలమని భావించామని శ్రేయస్ అయయర్ వెల్లడించాడు. ‘లక్ష్యాన్ని సులభంగానే ఛేదించగలమని భావించాము. కానీ బంతి పిచ్‌పై పడి లోపలికి, బయటికి కదలడంతో బ్యాటర్లకు పరిస్థితిని అంచనా వేయడం కష్టమైంది. మీరు ఓసారి వికెట్లు పరిశీలిస్తే.. ఎవరూ నిర్లక్ష్యంగా ఆడి ఔట్ కాలేదు. న్యూజిలాండ్ బౌలర్లు వేసిన మంచి బంతులకే వికెట్లు కోల్పోయాము. ఈ ఓటమిని వెంటనే మర్చిపోవాలి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో ఎక్కడ తప్పులు జరిగాయో విశ్లేషించుకోవాలి. అదే సమయంలో ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ విజయాల నుంచి స్ఫూర్తి పొందాలని జట్టుకు సూచించాము. తదుపరి మ్యాచ్‌కు కొత్త ఆలోచనలతో, తాజా ఉత్సాహంతో సిద్ధం అవుతాం. మాకు పటిష్ట జట్టు ఉంది. తప్పక గెలుస్తాం’ అని సర్పంచ్ సాబ్ ధీమా వ్యక్తం చేసాడు.
నాలుగో వన్డేలో మాట్ హెన్రీ 27 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా, మాథ్యూ ఫిషర్ మూడు వికెట్లు తీశాడు. భారత్ తరఫున ఇషాన్ కిషన్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ భారీ ఓటమితో సిరీస్‌లో న్యూజిలాండ్ భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవడమే ఇప్పుడు టీమిండియా ముందున్న లక్ష్యం.

