IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు ఎంపికపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌లను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా స్పందించారు. జడేజాను పక్కన పెట్టడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అభిప్రాయపడ్డారు.
సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో టాస్ అనంతరం మాట్లాడిన సునీల్ గవాస్కర్.. ఈ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్‌లో జడేజా భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మూడో స్థానంలో ఉన్నాడని గుర్తుచేశారు. హాగ్లీ ఓవల్ వంటి పిచ్‌పై నాలుగో, ఐదో రోజు అతడి స్పిన్ బౌలింగ్ ఎంతో ఉపయోగపడేదని పేర్కొన్నారు. బౌలర్లకు పెద్దగా సహకరించని పిచ్‌లపై కూడా బంతిని తిప్పగల సామర్థ్యం జడేజాకు ఉందని తెలిపారు. సిరాజ్ గురించే ఎక్కువగా చర్చిస్తున్నామని, అయితే జడేజా జట్టు నుంచి తప్పుకోవడాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో సిరాజ్ అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ కాగా.. జడేజా మూడో స్థానంలో ఉన్నాడని వివరించారు. జడేజా, సిరాజ్ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కకపోవడం దురదృష్టకరమని సన్నీ వ్యాఖ్యానించారు.
జట్టు ఎంపికపై తనకు కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ.. తుది జట్టు ప్రకటించిన తర్వాత దానికి మద్దతు ఇవ్వడం ముఖ్యమని గవాస్కర్ స్పష్టం చేశారు. 11 మంది ఆటగాళ్లతో పాటు 14 లేదా 16 మంది సభ్యుల ఎంపికపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని, కానీ ఒకసారి జట్టు ఖరారైన తర్వాత అది మన భారత జట్టేనని అన్నారు. ఎంపికైన ఆటగాళ్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని మంచి ప్రదర్శన చేయాలని ఆకాంక్షించారు. మరోవైపు న్యూజిలాండ్ మాజీ మహిళా క్రికెటర్ కేటీ మార్టిన్ కూడా సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై స్పందించారు. హాగ్లీ ఓవల్‌లోని పచ్చికతో కూడిన పిచ్‌పై సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసేవాడని, అతడు ఆడకపోవడం న్యూజిలాండ్‌కు కలిసొచ్చిందని అభిప్రాయపడ్డారు. భారత జట్టులో సిరాజ్ లేకపోవడం తమకు సంతోషకరమైన విషయమని ఆమె వ్యాఖ్యానించారు.
రెండో టెస్టులో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టులో ఆడిన జట్టులో భారత్ ఒక మార్పు చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో 26 ఏళ్ల పేసర్ గుర్నూర్ భ్రార్‌కు అవకాశం కల్పించింది. దీంతో అతడు టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. మొదటి రోజు ఆట ముగిసేసరికి కివీస్ 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. క్రీజ్‌లో టామ్ బ్లండెల్ (53), గ్లెన్ ఫిలిప్స్ (36) ఉన్నారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఆకాశ్ దీప్ 2 వికెట్స్ తీయగా.. గుర్నూర్ బ్రా్, అన్షుల్, సుందర్ తలో వికెట్ తీశారు. జడేజా, సిరాజ్ జట్టులో ఉంటే.. మరిన్ని వికెట్స్ పడేవని సన్నీ చెప్పుకొచ్చారు.

