IND vs NZ 2nd T20I: నేడు భారత్‌-న్యూజిలాండ్ రెండో టీ20.. లైవ్‌ స్ట్రీమింగ్‌, పిచ్‌ రిపోర్ట్‌, ప్లేయింగ్‌ 11 ఇదే!

Ind Vs Nz 2nd T20i

Ind Vs Nz 2nd T20i

India Playing 11 vs New Zealand 2nd T20I: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు రెండో మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌ వేదికగా శనివారం (అక్టోబర్‌ 24) ఈ మ్యాచ్‌ జరగనుంది. తొలి టీ20లో 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ప్రస్తుతం సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్‌లోనూ గెలిచి ఆధిక్యాన్ని పెంచుకోవాలని శ్రేయస్‌ అయ్యర్‌ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు కివీస్ సిరీస్ సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌ న్యూజిలాండ్‌ సొంతగడ్డపై జరుగుతుండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

బౌలింగ్‌లో తేలిపోతున్న భారత్:


తొలి టీ20లో బ్యాటింగ్‌లో భారత్ అదరగొట్టింది. సంజు శాంసన్‌, అభిషేక్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌, తిలక్ వర్మ, నమన్‌ ధీర్‌ దంచి కొట్టారు. అయితే తొడ కండరానికి స్వల్ప గాయం కావడంతో వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ రెండో టీ20కి దూరమయ్యాడు. అతడి గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఇషాన్‌ స్థానంలో కుమార్‌ కుశాగ్రను స్క్వాడ్‌లోకి చేర్చినట్లు ఐసీసీ వెల్లడించింది. ఇషాన్‌ అందుబాటులో లేకపోవడంతో వైభవ్‌ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కనుంది. భారత జట్టు బౌలింగ్‌లో మాత్రం మెరుగుపడాల్సి ఉంది. వరుసగా నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో మన బౌలర్లు 200కు పైగా పరుగులు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మయాంక్‌ యాదవ్‌ సహా చాలా కాలం తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన భువనేశ్వర్‌ కుమార్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

కివీస్ బ్యాటింగ్ అదుర్స్:
మరోవైపు న్యూజిలాండ్‌ కూడా బౌలింగ్‌లో తమ ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో మిచెల్‌ బ్రేస్‌వెల్‌, మిచెల్‌ సాంట్నర్‌ చెరో రెండు వికెట్లు తీసి భారత్‌ను కొంత ఒత్తిడిలోకి నెట్టినా.. చివరికి లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. పవర్‌ప్లేలో పరుగులను నియంత్రించడం కివీస్‌ బౌలర్లకు కీలకం కానుంది. కివీస్ బ్యాటింగ్ మాత్రం బాగుంది. ఫిన్‌ అలెన్‌ 24 బంతుల్లో 45 పరుగులు చేయగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ 40 బంతుల్లో అజేయంగా 82 పరుగులతో చెలరేగాడు. బేవాన్‌ జాకబ్స్‌ 16 బంతుల్లో 31 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు.

రెండో టీ20 లైవ్‌ ఎక్కడ చూడాలి:
భారత్‌, న్యూజిలాండ్‌ రెండో టీ20 క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో జరగనుంది. టాస్‌ మధ్యాహ్నం 12 గంటలకు పడనుండగా.. మ్యాచ్‌ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం అవుతుంది. సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ సహా సోనీలివ్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ కానుంది. భారత్‌లో టీవీ ద్వారా సోనీ స్పోర్ట్స్‌ ఛానళ్లలో మ్యాచ్‌ను వీక్షించవచ్చు. ఆన్‌లైన్‌లో సోనీలివ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

పిచ్‌ రిపోర్ట్‌:
క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌ మైదానం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. పిచ్‌పై మంచి బౌన్స్‌, వేగం ఉండటంతో బ్యాటర్లు స్వేచ్ఛగా షాట్లు ఆడే అవకాశం ఉంటుంది. అయితే ఇన్నింగ్స్‌ ఆరంభంలో పేసర్లకు కూడా సహకారం లభించొచ్చు. ముఖ్యంగా కొత్త బంతితో స్వింగ్‌ను రాబట్టగల బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు ఇబ్బందులు సృష్టించే అవకాశముంది. ఈ వేదికపై పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 162 పరుగులు. ఇంగ్లండ్‌ ఇదే మైదానంలో న్యూజిలాండ్‌పై 236/4 స్కోరు సాధించింది. ఇక్కడ లక్ష్య ఛేదనలోనూ జట్లు విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల టాస్‌ గెలిచిన కెప్టెన్‌ మొదట బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.

క్రైస్ట్‌చర్చ్‌ వాతావరణం:
క్రైస్ట్‌చర్చ్‌లో శనివారం ఎక్కువగా ఎండతో కూడిన పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. పగటిపూట ఉష్ణోగ్రత సుమారు 21 డిగ్రీల సెల్సియస్‌ వరకు చేరవచ్చు. సాయంత్రానికి అది 13–14 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంది. గంటకు 13–15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు ఉన్నాయి. చల్లటి వాతావరణం, గాలి కారణంగా ముఖ్యంగా ఇన్నింగ్స్‌ ఆరంభంలో పేసర్లకు కొంత సహకారం లభించవచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.

ప్లేయింగ్‌ 11 (అంచనా):
న్యూజిలాండ్‌: ఫిన్‌ అలెన్‌, టిమ్‌ సీఫర్ట్‌ (వికెట్‌కీపర్‌), డెవాన్‌ కాన్వే, గ్లెన్‌ ఫిలిప్స్‌, డారిల్‌ మిచెల్‌, బేవాన్‌ జాకబ్స్‌, మైకేల్‌ బ్రేస్‌వెల్‌, మిచెల్‌ సాంట్నర్‌ (కెప్టెన్‌), మాట్‌ హెన్రీ, జాకబ్‌ డఫీ, లాకీ ఫెర్గూసన్‌.
భారత్‌: అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, సంజు శాంసన్‌ (వికెట్‌కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, నామన్‌ ధీర్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మయాంక్‌ యాదవ్‌.