ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ముగిసిన 15 రోజుల్లోనే భారత క్రికెటర్లు వన్డే ఫార్మాట్‌కు సిద్ధమయ్యారు. శనివారం నుంచి ధర్మశాల వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు భారీ షాక్‌లు తగిలాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరం కాగా.. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా గాయంతో జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు.
కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
విరాట్ కోహ్లీ దూరం కావడంతో అత్యంత కీలకమైన నంబర్ 3 స్థానంలో ఎవరు బ్యాటింగ్‌కు వస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ ఇద్దరూ పోటీ పడుతున్నారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ సాధించిన రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.
దీనిపై భారత మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందించారు. విరాట్ కోహ్లీ లేని లోటును భర్తీ చేస్తూ ఇషాన్ కిషన్ నంబర్ 3 పొజిషన్‌లో బరిలోకి దిగుతాడని ఆయన అంచనా వేశారు. “ప్రస్తుతానికి ఇషాన్ కిషన్ దేవుడికి అత్యంత ఇష్టమైన బిడ్డలా ఉన్నాడు. అతనికి నంబర్ 3 స్థానం దక్కితే కచ్చితంగా పరుగులు సాధిస్తాడనే నమ్మకం ఉంది. ఎందుకంటే అతను ఇప్పుడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అనుకోకుండా ఎప్పుడు జట్టులో తలుపులు తెరుచుకున్నా.. మొదటగా లోపలికి అడుగుపెట్టేది ఇషాన్ కిషనే. జట్టులోకి రావడం, పరుగులు చేయడం, తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం అతనికి అలవాటే” అని ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించారు.
హార్దిక్ పాండ్యాకు కొత్త గాయం.. సిరీస్ నుంచి అవుట్
మరోవైపు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయాల బెడద అస్సలు వదలడం లేదు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నప్పుడు వెన్నునొప్పితో బాధపడిన హార్దిక్.. ఫిట్‌నెస్ క్లియరెన్స్ కోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు వెళ్లాడు. అక్కడ అసెస్‌మెంట్‌లో భాగంగా పూర్తి స్థాయిలో 10 ఓవర్లు బౌలింగ్ చేయడంతో, అతని తొడ కండరాలు పట్టేసాయి.
ఈ కొత్త గాయం కారణంగా అతను ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. “హార్దిక్ కోలుకోవడానికి కనీసం మూడు వారాల సమయం పడుతుంది. కాబట్టి ఈ వన్డే సిరీస్‌లో అతను ఆడే అవకాశం ఎంతమాత్రం లేదు” అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని హార్దిక్‌ను వన్డేల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడించాలని భావిస్తున్న తరుణంలో, 32 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌కు ఈ గాయం పెద్ద ఎదురుదెబ్బగా మారింది. సిరీస్ షెడ్యూల్ వివరాల్లోకి వెళ్తే.. మొదటి వన్డే జూన్ 13 (శనివారం) ధర్మశాలలో, రెండో వన్డే జూన్ 17న లక్నోలో.. మూడో వన్డే జూన్ 20న చెన్నైలో జరుగుతుంది.

